సూర్య సినిమాపై లీకులిచ్చాడు!

Last Updated on by

అల్లూ వార‌బ్బాయ్ శిరీష్ న‌టించిన నాలుగు సినిమాల్లో రెండు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్‌. గౌర‌వం, ఒక్క క్ష‌ణం ఫ్లాపైనా కొత్త జంట‌, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు డ‌బ్బులు తెచ్చాయి. న‌టుడిగా కాస్తంత ఫ‌ర్వాలేద‌నిపించాడు శిరీష్‌. అయితే బంప‌ర్ హిట్ కొడుతుంద‌నుకున్న ఒక్క క్ష‌ణం మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ విష‌యాన్ని శిరీష్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతున్నాడు. హిట్ట‌వుతుంద‌నుకుంటే ఫ‌లితం తారుమారైంద‌ని నేరుగా ఈరోజు సినీపాత్రికేయుల‌తో మాట్లాడుతూ నాలుక్క‌రుచుకున్నాడు. సినిమా జ‌యాప‌జ‌యాల్ని ఒక్కోసారి ఊహించ‌లేమ‌న్నాడు. రాంగ్ రిలీజ్ అని కొంద‌రు… థ్రిల్ల‌ర్ జోన‌ర్ ఒక వ‌ర్గానికేన‌ని కొంద‌రు విశ్లేషించారు. ఏదైతేనేం ఆ సినిమా ఫ‌లితం ఊహించ‌నిది అని చెప్పాడు.

ఇక తాను న‌టించే త‌దుప‌రి సినిమాల గురించి చెప్పాడు శిరీష్‌. ప్ర‌స్తుతం దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `ఏబీసీడీ` రీమేక్‌లో న‌టిస్తున్నాన‌ని సంజీవ్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని శిరీష్ తెలిపాడు. మ‌ధుర‌శ్రీ‌ధ‌ర్ వేరొక నిర్మాత‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక‌పోతే రీమేక్‌లు.. స్ట్రెయిట్ సినిమాలు అనేది ఉండ‌దు. జ‌నాల‌కు న‌చ్చితే ఏదైనా చూస్తార‌ని అన్నాడు. అలానే సూర్య, మోహ‌న్‌లాల్ న‌టిస్తున్న ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో త‌న‌కు ఓ లీడ్ రోల్ ద‌క్కింద‌ని చెప్పాడు. కె.వి.ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ ఎలా వ‌చ్చింది? అని అడిగితే ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా తాను న‌టించిన `ఒక్క క్ష‌ణం` వీక్షించిన కేవీ ఆనంద్ త‌న‌కు అవ‌కాశ‌మిచ్చార‌ని తెలిపాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు, మ‌రిన్ని క‌థ‌లు విన్నాన‌ని, వేరొక ప్రాజెక్టు వివ‌రం త్వ‌ర‌లోనే చెబుతాన‌ని శిరీష్ అన్నాడు. మొత్తానికి 30వ తారీఖు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శిరీష్ చాలా సంగ‌తులే ఇలా పూస‌గుచ్చాడు.

User Comments