ముందు తప్పు చేసి, తర్వాత ఓ రహస్యాన్ని చెప్పిన అల్లు శిరీష్!

మెగా హీరో, అల్లువారబ్బాయి శిరీష్ ఎట్టకేలకు ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో కెరీర్ లో తొలి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్ తో శిరీష్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన జోరు చూపిస్తున్నాడు. ప్రతీ విషయంలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు బాగానే దగ్గరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే నేడు కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని అల్లు శిరీష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆ విషయంలోకి వెళితే, అల్లు శిరీష్ తాజాగా ట్విట్టర్ లో.. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రపంచానికి భగవద్గీతను అందించిన కృష్ణ భగవానుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ ఇచ్చుకున్నాడు.

ఆ తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని అల్లు శిరీష్ బయటపెట్టడం విశేషం. శిరీష్ దాని గురించి చెబుతూ.. మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్ స్పైర్ అయ్యారని, అందుకే మా బ్యానర్ కు ‘గీతా ఆర్ట్స్’ అని పేరు పెట్టారని పేర్కొన్నాడు. అంతేకాకుండా చాలా మంది మా అమ్మ పేరు గీత అని అనుకుంటారని, కానీ మా అమ్మ పేరు నిర్మల అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. ఈ విధంగా ‘గీతా ఆర్ట్స్’ వెనకున్న రహస్యాన్ని కృష్ణాష్టమి సందర్బంగా అల్లు శిరీష్ బయటపెట్టి అభిమానులను కాసేపు ఖుషీ చేశాడు. దీనికి ముందు అల్లు శిరీష్ ట్విట్టర్ లో తన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో చిన్న సంభాషణ నడిపి తర్వాత దానిని డిలీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఆ స్టోరీలోకి వెళితే, లావణ్య బ్యూటీ పార్లర్ పేరుతో ఉన్న ఓ పిక్ ను పోస్ట్ చేసి కంగ్రాట్స్ అంటూ లావణ్య త్రిపాఠికి ట్వీట్ చేశాడు శిరీష్. దానికి వెంటనే స్పందించిన లావణ్య త్రిపాఠి థాంక్స్ చెబుతూ.. కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకుంటున్నామని, వెల్కమ్ అంటూ శిరీష్ కు సరదా రిప్లై ఇచ్చింది. ఇక్కడే శిరీష్ సోషల్ మీడియాలో పబ్లిక్ గా ఉన్నామనే విషయాన్ని మర్చిపోయే ప్రవర్తించాడు. లావణ్య త్రిపాఠి రిప్లైకు కౌంటర్ ఇద్దామని అనుకుని.. అది లేడీస్ పార్లర్ కదా, మగవాళ్ళను తీసుకుంటున్నారా అని అడుగుతూ, అది నిజంగా లేడీస్ పార్లరేనా లేక ఇంకేమైనానా అంటూ అదోరకంగా ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కై ఆ మేటర్ లోకి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావడంతో విషయం అర్థంచేసుకున్న ఈ హీరోహీరోయిన్లు వెంటనే తమ తమ ట్వీట్స్ ను డిలీట్ చేసేశారు. అయితే, జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో శిరీష్ పై కామెంట్స్ పడిపోతున్నాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా మసులుకోవాలో ఇంకా శిరీష్ నేర్చుకోలేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా శిరీష్ ఈ మధ్య సోషల్ మీడియాలో తనదైన ముద్రను బాగానే వేస్తున్నాడని చెప్పుకోవాలి.