అమెజాన్‌తో 2.0కి చిక్కులు

Last Updated on by

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.0 చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ వసూళ్ల వేట సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రిటిక్స్‌లో మిశ్ర‌మ స్పంద‌న‌లు ఉన్నా, తొలిరోజు వ‌సూళ్లు అంతంత మాత్ర‌మే అయినా, పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాకి కొంత‌వ‌ర‌కూ క‌లిసొచ్చింది. వీకెండ్ వసూళ్లు పెర‌గ‌డంలో ఇది సాయ‌మైంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. బాహుబ‌లి 2 రికార్డుల్ని బ‌ద్ధ‌లు కొట్ట‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్లు సాధిస్తోంద‌ని, అయితే బ్రేక్ ఈవెన్ సాధించి పెద్ద విజ‌యం సాధించాలంటే రెండు మూడు వారాల పాటు ఎదురేలేని క‌లెక్ష‌న్స్ సాధించాల్సి ఉంటుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

అయితే ఇలాంటి విశ్లేష‌ణ‌ల న‌డుమ 2.0 చిత్రానికి ఓ పెద్ద చిక్కు ఉంది. ఇలాంటి భారీ చిత్రం నాలుగైదు వారాలు ఆడితేనే గిట్టుబాటు అయ్యే స‌న్నివేశం కొన్నిచోట్ల ఉంటుంది. ఎందుకంటే భారీ మొత్తాల్ని వెచ్చించి పంపిణీ హ‌క్కుల్ని చేజిక్కించుకున్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డ‌బ్బు మొత్తం వెన‌క్కి రావాలంటే తొలి వారం ఊపుతోనే కుద‌ర‌ని ప‌ని. అందుకే ఇప్పుడు ఈ సినిమాని అమెజాన్ లైవ్‌లోకి తెచ్చేస్తుంద‌న్న టెన్ష‌న్ నిల‌వ‌నీయ‌డం లేద‌ట‌. ఒప్పందం ప్ర‌కారం అమెజాన్ 50రోజుల్లోనే ఈ సినిమాని ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేసేస్తుంది. ఈ ఆలోచ‌న‌తో జ‌నం థియేట‌ర్ల వ‌ర‌కూ రాక‌పోతే క‌ష్ట‌మే మ‌రి. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడ‌లేని వాళ్లు అమెజాన్‌లో వ‌స్తుందిలే అనుకుంటే ఆ మేర‌కు పంచ్ ప‌డిపోతుంది. ఇక మ‌రోవైపు ఈ సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 25కోట్లు వ‌సూలు చేసింద‌ని దిల్ రాజు- ఎన్‌వి ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. త‌మిళంలో మాత్రం స‌న్నివేశం వేరుగా ఉంద‌ట‌. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఊపు అక్క‌డ క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు. ఓవ‌ర్సీస్‌లోనూ ఆశించినంత జెట్ స్పీడ్ లేదు. ఇప్ప‌టికి $1,126,403 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు ద‌క్కాయ‌న‌న్న మాట వినిపిస్తోంది. ఈ శ‌ని, ఆది వారాల వ‌సూళ్ల లెక్క‌లు తేలితే కొంత‌వ‌ర‌కూ క్లారిటీ వ‌స్తుందేమో? 600కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకి దాదాపు 550 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది.

User Comments