75 ఏళ్ళ పరిపూర్ణ వ్యక్తిత్వం అమితాబ్..

అమితాబ్ బ‌చ్చ‌న్.. ఈ పేరు ఇండియాలో ఓ బ్రాండ్. అస‌లు నువ్వు హీరో ఏంటి..? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా..? ఒక్క‌సారి నీ గొంతు నువ్వు విను ఎంత చెండాలంగా ఉందో తెలుస్తుంది.. ఇవి ఒక‌ప్పుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ను కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు అవ‌కాశాల కోసం  వెళ్లిన‌పుడు అన్న మాట‌లు.

కానీ ఆ త‌ర్వాత వాళ్లే పిలిచి మ‌రి మెగాస్టార్ తో సినిమాలు చేసారు. ఎన్నో సంచ‌ల‌నాల‌కు.. ఇంకెన్నో అద్బుతాల‌కు.. మ‌రెన్నో సుఖాల‌కు.. క‌ష్టాల‌కు.. ఇలా అన్నింటికీ అమితాబ్ బ‌చ్చ‌న్ జీవితం నిద‌ర్శ‌నం.

ఈయ‌న ఈ అక్టోబ‌ర్ 11తో 75వ వ‌సంతంలోకి అడుగు పెడుతున్నారు. ప‌రిపూర్ణ‌మైన జీవితాన్ని గ‌డుపుతూ ఇప్ప‌టికీ న‌టుడిగా ఏదో సాధించాల‌నే త‌ప‌న‌తో ముందుకెళ్తున్నారు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 45 ఏళ్లు దాటింది. వ‌య‌సు 75 వ‌చ్చేసింది. కానీ ఇప్ప‌టికీ న‌ట‌న‌పై మోజు త‌గ్గ‌లేదు.. ఆస‌క్తి త‌గ్గ‌లేదు.. ఇంకా ఏదో చేయాల‌నే త‌ప‌న‌.

దానికోస‌మే ఆరాటం. ఇప్ప‌టికీ బిగ్ బి సినిమాలంటే అభిమానులు ఆస‌క్తి చూపిస్తున్నారంటే దానికి కార‌ణం ఆయ‌న చూపించే వేరియేష‌న్.

ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దిగ్గ‌జ న‌టుడు. ఈయ‌న కెరీర్ లో ఎన్నో మ‌రుపురాని చిత్రాలున్నాయి.

సిల్ సిలా.. ఖుదాగ‌వా.. దీవార్.. షోలే.. కూలీ.. స‌ర్కార్.. క‌బీఖుషీ క‌బీఘ‌మ్.. ఇలా చెప్పుకుంటూ పోతే రాసుకోడానికి గ్రంథం కావాలి. కూలీ షూటింగ్ లో గాయ‌ప‌డిన‌పుడు బిగ్ బి చ‌నిపోతాడ‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

అయినా ఆయ‌న మృత్యువుతో పోరాడి గెలిచారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లి ఎంపిగా చేసినా.. పాలిటిక్స్ త‌న‌కు ప‌డ‌వ‌ని వెన‌క్కి వ‌చ్చేసారు. ఆర్థికంగా న‌ష్ట‌పోయారు.

కేబిసితో మ‌ళ్లీ పుంజుకున్నారు. వ‌ర‌స సినిమాల‌తో మెగాస్టార్ గా త‌న పేరు సార్థకం చేసుకున్నారు.

ఇప్ప‌టికీ త‌నలోని న‌టుడికి విశ్రాంతిని ఇవ్వ‌డం లేదు అమితాబ్ బ‌చ్చ‌న్. ప్ర‌స్తుతం ఈయ‌న ఓ మై గాడ్ ఫేమ్ ఉమేష్ శుక్లా ద‌ర్శ‌క‌త్వంలో 102 నాటౌట్ సినిమా చేస్తున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్.

ఇందులో 102 ఏళ్ళ వ్య‌క్తిగా అమితాబ్.. అత‌డి 75 ఏళ్ల త‌న‌యుడిగా రిషిక‌పూర్ న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌రోసారి అమితాబ్ కొత్త గెట‌ప్ లోకి మారిపోయాడు.

ఈయ‌న గెట‌ప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కెమెరా ప‌నిత‌నం.. మేక‌ప్ నిపుణ‌త‌తో మ‌రోసారి బిగ్ బి కొత్త‌గా క‌నిపిస్తున్నారు.

మొత్తానికి ఈయ‌న ఇలాంటి పుట్టిన‌రోజులు ఇంకెన్నో జ‌రుపుకోవాల‌ని మ‌న‌సారా ఆశిస్తూ.. వ‌న్స్ అగైన్ హ్యాపీ బ‌ర్త్ డే టూ అమితాబ్ బ‌చ్చ‌న్.

Follow US