అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు మూవీ రివ్యూ

న‌టీన‌టులు: అజ్మ‌ల్ అఈర్, ధీర‌జ్ కేవీ, ధ‌నంజ‌య్ ప్ర‌భునే, అర‌వింద్ రావు, టీవీ9 జాఫ‌ర్, అలీ, ధ‌న్ రాజ్, బ్ర‌హ్మానందం, మ‌హేష్ క‌త్తి త‌దిత‌రులు..
రిలీజ్ తేదీ: 12 డిసెంబ‌ర్ 2019
నిర్మాత‌: అజ‌య్ మైసూర్
సంగీతం: ర‌వి శంక‌ర్
ద‌ర్శ‌క‌త్వం:  సిద్దార్థ్ తాతోలు-ఆర్జీవీ

ముందు మాట‌:
`క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అంటూ ఆరంభ‌మే రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఏపీ రాజ‌కీయాల్లో కుల రాజ‌కీయాల్ని.. హత్యా రాజ‌కీయాల్ని ఆర్జీవీ ట‌చ్ చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. చంద్ర‌బాబు నాయుడు .. లోకేష్.. కేఏ పాల్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ .. వీళ్లంద‌రినీ జోక‌ర్లుగా చూపిస్తూ ఆర్జీవీ చేసిన హంగామాతో అత‌డు ఓ ప‌ర్ఫెక్ట్ సెటైరిక‌ల్ మూవీ తీస్తున్నాడ‌నే భావించారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ని అత‌డు హీరోగా చూపిస్తూ చాలానే హ‌డావుడి చేశాడు. అయితే టీజ‌ర్ ట్రైల‌ర్ పోస్ట‌ర్ తో పెంచిన హైప్ దృష్ట్యా సినిమాలో ఏదో ఉంటుంద‌ని ఆశించిన వారికి ఆర్జీవీ ఎలాంటి ట్రీటిచ్చాడ‌న్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

క‌థాక‌మామీషు:
ఏపీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వార్ నేప‌థ్యంలోని సినిమా ఇది. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల అంశానికి ముడి పెడితూ అధికారంలోకి వ‌చ్చిన జగన్ నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్) పై ప్ర‌తిప‌క్ష బాబు పార్టీ అయిన ఆర్.సీ.పీ పార్టీ ఎలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డింది?  బాబు.. అత‌డి పుత్రుడు సీఎం చ‌ర్య‌ల‌కు ఎలా అడ్డు ప‌డ్డారు?  సీఎం జ‌గ‌న్ నాథ్ రెడ్డి హామీల్ని నెర‌వేర్చే క్ర‌మంలో వాటికి అడ్డు పడే ఆర్.సీ.పీ నాయ‌కుల‌ను అసెంబ్లీ సాక్షిగా అవ‌మాన ప‌రిచాక‌.. ఆ అవ‌మానం త‌ట్టుకోలేని బాబు చేత‌కాని కొడుకుని చూసి ఎలాంటి ఆందోళ‌న‌కు గుర‌య్యాడు?  ఆ క్ర‌మంలోనే బాబు ప్ర‌ధాన అనుచ‌రుడైన‌ ద‌య‌నేని ర‌మా సీఎంపై ఎలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డాడు?  ర‌మా అనూహ్య హ‌త్య‌తో రాష్ట్రంలో రాజ‌కీయ స‌న్నివేశం ఎలా మారింది?  మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లకు వెళ్లే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? ఈ క‌థ‌లోనే  పీపీ జాల్… మన సేన అధినేత ఎలాంటి పాత్రను పోషించారు? లాంటి రాజ‌కీయాంశాల్ని ట‌చ్ చేస్తూ తీసిన చిత్ర‌మిది.

రియాలిటీకి కొంత‌  ఫిక్ష‌న్ క‌థ‌ను జోడించి అందులో వాస్త‌విక పాత్ర‌ల్ని యాడ్ చేసి ఆర్జీవీ చేసిన ప్ర‌య‌త్న‌మిది. ప‌ర‌మ రొటీన్ సీన్లను అటు ఇటు తిప్పి వర్మ తీసిన ఈ సినిమా ఓ పార్టీ కార్యకర్తలకు ఏదో ఒక వ‌ర్గానికి  బావుంద‌ని అనిపించినా.. అది స‌గ‌టు ప్రేక్ష‌కుడికి రుచిస్తుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. పాత్ర‌లు పాత్ర‌ధారుల్ని సెటైరిక‌ల్ గా చూపించి న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నించినా అది కొంత‌వ‌ర‌కే స‌ఫ‌ల‌మైంది. అయితే ఈ సినిమాలో సినిమాటిక్ గా క‌న్విన్స్ చేయ‌డంలో వ‌ర్మ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఏవో కొన్ని సీన్లు కామెడీ.. సెటైర్ జోకులతో ఆక‌ట్టుకుంటుంది త‌ప్ప సినిమాగా దీనిని చూడ‌లేని ప‌రిస్థితి. ఇక సినిమా తీసిన విధానం ప‌ర‌మ చెత్త‌గా ఎలాంటి ఫ్లో లేకుండా నాశిర‌కంగా అనిపిస్తుంది.  ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, ప్రీ క్లైమాక్స్ సెకండాఫ్‌ లోని కీలక సన్నివేశాలన్నీ స్లోగా సాగుతూ నిరుత్సాహ పరిచాయి.

న‌టీన‌టులు:
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్ర‌తిపక్ష పార్టీ సామాజిక వ‌ర్గాల వారీగా విడిపోయి ఎలాంటి రాజ‌కీయాలు సాగిస్తున్నాయి? అన్న కాన్సెప్టును ఎంచుకుని అందులో రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేవారిని ఎంపిక చేసుకున్న వ‌ర్మ పాత్ర‌ల ప‌రంగా కొంత‌వ‌ర‌కూ మ్యాజిక్ చేయ‌గ‌లిగారు. జ‌గ‌న్ పాత్ర‌లో అజ్మ‌ల్ అద్భుతంగా న‌టించాడు. ముఖ్యంగా జగన్ బాడీ లాంగ్వేజ్ లోని ప్రధానంగా కొన్ని హావభావాలను, అజ్మల్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక బాబు పాత్రను పోషించిన నటుడు నటన పరంగా ఎలా ఉన్నా అచ్చం బాబులానే కనిపిస్తూ మెప్పించాడు. స్పీకర్ గా అలీ, సిట్ ఆఫీసర్ గా కనిపించిన స్వప్న, మ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ .. పీపీ జాల్ (కేఏ పాల్)  పాత్ర‌ధారులు.. సీబీఐ పాత్రలో నటించిన కత్తి మహేష్, అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. గంగ‌వీటి భ‌వానిగా ధ‌న్ రాజ్ న‌ట‌న ఓకే. ఇక బాబు సెక్యూరిటీగా న‌టించిన బ్ర‌హ్మానందం పాత్ర వృధా అయ్యింది.

ప్ల‌స్ పాయింట్స్:

*ఎంచుకున్న పాయింట్.. బ‌ర్నింగ్ పాలిటిక్స్
* పాత్ర ధారుల్లో ఫ‌న్

మైనస్ పాయింట్స్ :

*వీక్ నేరేష‌న్
* గ్రిప్పింగ్ గా లేని స్క్రీన్ ప్లే.. పేల‌వ‌మైన సీన్లు
* గ‌జిబిజి సీక్వెన్సులు

సాంకేతిక విభాగం :

ఆర్జీవీ అంటే టెక్నిక‌ల్ గా వండ‌ర్ ఫుల్ సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో రాజ‌కీయాంశాల్ని పేర‌డీలుగా చూపిస్తూ కామెడీ చేసే ప్ర‌య‌త్నం త‌ప్ప ఇంకేదీ సాంకేతికంగా అస‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. అస‌లు ఈ చిత్రానికి సిద్ధార్థ్ తాతోలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారా.. లేక ఆర్జీవీనే దర్శ‌క‌త్వం వ‌హించారా? అన్న‌ది ఎవ‌రికీ తెలీదు. జగదీశ్.సి సినిమాటోగ్రఫీ .. ర‌విశంక‌ర్ సంగీతం తేలిపోయాయి. ఇక సిరాశ్రీ లిరిక్స్ స‌హా ఇత‌ర ర‌చ‌నా విభాగం ఆశించిన మ్యాజిక్ చేయ‌లేక‌పోయాయి. ఇలాంటి సినిమాని నిర్మించ‌డం అన్న‌ది నిర్మాత దుస్సాహ‌సం అనే చెప్పాలి.

ముగింపు:
పాతాళంలోకి ప‌డిపోయిన ఆర్జీవీ

రేటింగ్:
1/5