ఏంజిల్ రివ్యూ

రివ్యూ: ఏంజిల్

రేటింగ్:2.25/5

న‌టీన‌టులు: నాగఅన్వేష్, హెబ్బాప‌టేల్, సప్త‌గిరి త‌దిత‌రులు

ద‌ర్శ‌కుడు: బాహుబ‌లి ఫ‌ళణి

విన‌వ‌య్యా రామ‌య్యా సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు నాగఅన్వేష్. తొలి సినిమాతో పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోని ఈ కుర్ర హీరో.. రెండో సినిమాతో అయినా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. మ‌రి ఈయ‌న న‌టించిన ఏంజిల్ సినిమా ఎంత‌వ‌ర‌కు మెప్పించింది..?
క‌థ‌: 
ఏంజిల్ ఓ సోషియో ఫాంట‌సీ. పురావ‌స్తు తవ్వ‌కాలు జ‌రుపుతున్న‌పుడు.. అమరావతి ప్రాంతంలో ఒక అరుదైన బంగారు విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా మరో చోటికి చేర్చే బాధ్య‌త‌ను నాని (నాగ అన్వేష్), గిరి (సప్తగిరి) లకు అప్ప‌గిస్తారు. వారు త‌మ‌ పనిలో బిజీగా ఉండగా నక్షత్ర (హెబ్బా పటేల్) అనే అమ్మాయి నానికి పరిచయం అవుతుంది. నక్షత్ర మామూలు మాన‌వ కన్య కాదు.. ఓ గంధర్వ కన్య. దివిలో నివసించే ఆమె భూలోకానికి వ‌స్తుంది. ఆమె ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది..? నానితో ఎలా ప్రేమలో పడింది..? నాని, నక్షత్ర పెళ్లి చేసుకున్నారా..?  లేదంటే ఆమె మ‌ళ్లీ త‌మ లోకానికి వెళ్లిపోయిందా..? అనేదే ఈ సినిమా కథ.

క‌థ‌నం: 
ముందు నుంచి అనుకుంటున్న‌ట్లే ఈ చిత్రం జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రిని పోలి ఉంది. క‌థ మొత్తం ఒక‌టే కాక‌పోయినా.. ప్లాట్ మాత్రం అక్క‌డ్నుంచే తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు ఫ‌ళ‌ని. దాని చుట్టూనే క‌థ అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఈ చిత్ర క‌థ‌ను రాసుకున్నాడు ఫ‌ళని. గంధర్వ కన్య ఆయిన ఆమే భూమి మీదకు రావడాలనుకోవడం.. ఆమె ఇక్క‌డే ఉండాల‌నుకోవ‌డం.. ఆ క్ర‌మంలోనే హీరోను క‌ల‌వ‌డం.. అత‌డితో ప్రేమ‌.. విల‌న్ల ఎంట్రీ.. ఇలా ప‌క్కా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా సాగిపోతుంది ఈ చిత్రం. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా పెద్ద‌గా ట్విస్టులేం లేకుడానే సాగే క‌థ‌.. ప్రీ ఇంట‌ర్వెల్ లో ఊపు అందుకుంటుంది. కానీ సెకండాఫ్ లో మ‌ళ్లీ డౌన్ అవుతుంది. ఒక గంధర్వ కన్య భూమి మీదకు రావడం, వేరొకరికి మంచి చేయాలని అనుకోవడం, ఆ ప్రాసెస్లో ప్రేమలో పడటం వంటి అంశాలు కథ పరంగా బాగానే ఉన్నాయి. మాస్ కోసం విప‌రీత‌మైన ఇమేజ్ ఉన్న హీరోలా నాగఅన్వేష్ ను చూపించ‌డం పెద్ద‌గా రుచించ‌దు. ఓవ‌రాల్ గా ఈ చిత్రం అనుకున్నంత‌గా మాత్రం లేదు.

న‌టీన‌టులు: 
కొత్త కుర్రాడైనా నాగ అన్వేష్ బాగానే చేసాడు. ఈయ‌న తొలి సినిమా విన‌వ‌య్యా రామ‌య్యాతో పోలిస్తే ఇప్పుడు బెట‌ర్. ఇక హీరో స్నేహితుడిగా సప్తగిరి చేసిన కామెడి అక్కడక్కడా నవ్వించింది. హెబ్బాప‌టేల్ గ్లామ‌ర్ షోతో నెట్టుకొచ్చింది. ఈమె కారెక్ట‌ర్ కంటే కూడా అందాల ఆర‌బోత‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. లుక్స్ పరంగా కూడా అందంగా కనబడుతూ ఆకట్టుకుంది. కబీర్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే వారి పరిధి మేరకు నటించారు.

టెక్నిక‌ల్ టీం: 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు గొప్పగా లేవు. ఆర్ఆర్ అక్కడక్కడా బాగుంది. కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు భీమ్స్. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. గంధర్వ లోకంలో సన్నివేశాలు బాగా చిత్రికరించారు సినిమాటోగ్రఫర్. ఎత్నిక్ క్రియేటివ్ స్టూడియోస్ వారి సీజీ వర్క్ బాగుంది. డైరెక్టర్ పళని ఎంచుకున్న కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే విష‌యంలో బాగా వెన‌క‌బ‌డిపోయాడు. పాత క‌థ‌నే మ‌రింత నీర‌సం తెప్పించే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కొత్త హీరో అయినా నిర్మాతలు ఖ‌ర్చుకు వెన‌కాడ‌లేదు.

చివ‌ర‌గా:
ఈ ఏంజిల్.. కాస్త తీపి.. చాలా చేదు..