బాల‌కృష్ణ‌తో తీయాల్సిందే అనిల్‌

కొన్ని కాంబినేష‌న్లు భ‌లే క్రేజీగా అనిపిస్తాయి. ఫ‌లానా ఇద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌బోతున్నారంట అనే మాట చెవిలో ప‌డ‌డ‌మే ఆల‌స్యం… దానిపై ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి, ఆత్రుత మొద‌లైపోతుంటుంది. `సుప్రీమ్‌` త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ సినిమా అనే వార్త బ‌య‌టికొచ్చిన‌ప్పుడు కూడా ప‌రిశ్ర‌మ‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ ఇదే ర‌క‌మైన క్రేజ్ క‌నిపించింది. ఆ కాంబినేష‌నే కొత్త‌గా అనిపించింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల ఆ సినిమా కుద‌ర‌లేదు. అయితే ఎప్ప‌టికైనా బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల‌నే కోరిక అనిల్ రావిపూడికి బ‌లంగా ఉంద‌ట‌. ద‌ర్శ‌కుడు కాక మునుపు కూడా బాల‌కృష్ణ‌, మోక్ష‌జ్ఞ‌ల‌తో కూడిన ఓ ఫొటో ఆయ‌న రూమ్‌లో ఉండేద‌ట‌. ఎప్ప‌టికైనా ఈ ఇద్ద‌రితో సినిమాలు చేస్తాన‌ని చెప్పేవార‌ట‌. ఇదే విష‌యం ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు అనిల్ రావిపూడి. బాల‌కృష్ణ కోసం అనిల్ రావిపూడి `రామారావుగారు` పేరుతో ఇప్ప‌టికే ఓ క‌థ‌ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. మ‌రి అది ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌నేది చూడాలి. మ‌రి మోక్ష‌జ్ఞ‌తో ఆయ‌న సినిమా చేస్తాడో లేదో కాల‌మే స‌మాధానం చెప్పాలి. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఆ ఇంట‌ర్వ్యూలో అనిల్ ఎవ‌రితో సినిమా చేస్తే చూడాల‌నుంద‌ని స‌ర్వే చేయ‌గా, ఎక్కువ‌మంది బాల‌కృష్ణ‌తో సినిమా అని స‌మాధానం ఇచ్చారు. దీన్నిబ‌ట్టి ఈ కాంబోపై జ‌నాలు ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. దీన్ని తెలుసుకున్నాకైనా అనిల్ రావిపూడి బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల్సిందే క‌దా. ఏమంటారూ?