బ‌ర్త్‌డే గాళ్ ఛాన్స్ కొట్టిందా?

anupama parameswaran

ఈరోజు బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. `ప్రేమ‌మ్‌`తో మ‌ల‌యాళంలో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ, అదే సినిమా రీమేక్‌తో తెలుగులోకీ అడుగుపెట్టింది. త్రివిక్ర‌మ్ `అఆ`తోనూ అమ్మోరు క‌త్తి అనిపించుకుంది. వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటూ ఓ ఊపు ఊపేసింది కానీ… ఈమ‌ధ్య అమ్మ‌డికి స‌రైన సినిమాలు ప‌డ‌లేదు. దాంతో కెరీర్‌లో కాస్త జోరు త‌గ్గిన‌ట్టైంది. కొన్నాళ్లుగా మ‌ల‌యాళంలోనే సినిమాలు చేస్తూ వ‌స్తున్న ఈ చిన్న‌ది తాజాగా తెలుగులో ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ని చేజిక్కించుకున్న‌ట్టు స‌మాచారం. దిల్‌రాజు నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లానింగ్‌లో ఉంద‌ట‌. ఒక యువ ద‌ర్శ‌కుడు తీయ‌బోతున్న ఆ సినిమాలో అనుప‌మ అవ‌కాశం అందుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇక‌పై మ‌ళ్లీ తెలుగుపై దృష్టి పెట్టి మ‌రో ద‌ఫా అవ‌కాశాలు కొల్ల‌గొట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉంది అనుప‌మ‌. మ‌రి ఆమెకి ప‌రిస్థితులు ఏమాత్రం స‌హ‌క‌రిస్తాయో చూడాలి. అన్న‌ట్టుగా ప్లాన్ బిని కూడా ఆచ‌ర‌ణ‌లో పెట్టింది అనుప‌మ. ప్ర‌స్తుతం ఆమె మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న ఒక సినిమాలో న‌టిస్తూనే, ఆ సినిమాకి స‌హాయ ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌నిచేస్తోంది. అంటే క‌థానాయిక‌గా అవ‌కాశాలు త‌గ్గాక ఫుల్ ఫ్లెడ్జ్‌గా ద‌ర్శ‌క‌త్వంపై దృష్టిపెట్టాల‌నేది అమ్మ‌డి ఆలోచ‌న అట‌. మొత్తంగా ప‌క్కా ప్లానింగ్‌తోనే కెరీర్‌ని కొన‌సాగిస్తున్న ఈ చిన్న‌ది నిజంగా అమ్మోరు క‌త్తే అనిపించుకొంటోంది.