అనుష్క హిందీలో అంత రేటు పలికిందా..?

Anushka Bhagmati Hindi Version Rights
సౌత్ లో ముఖ్యంగా తెలుగులో భారీ చిత్రాల కథానాయికగా మారిపోయిన అనుష్క ఇటీవల బాహుబలి-2 తో అయితే దేవసేనగా దేశం మొత్తాన్ని మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో అనుష్కకు బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే, స్వీటీ అనుష్క భారీగా బరువు పెరిగిపోయి ఉండటంతో బాలీవుడ్ లోనే కాదు కదా టాలీవుడ్ లో కూడా కొత్త సినిమాకు సైన్ చేయలేకపోయింది. అందుకే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘భాగమతి’ తో అలరించడానికి అనుష్క రెడీ అయిపోతుంది.
ఈ మేరకు పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మించిన అనుష్క ‘భాగమతి’ ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో దుమ్మురేపుతుందని ఇన్నర్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తుండటం విశేషం. అందులోనూ హిందీ మార్కెట్ లోనే మెరుపులు మెరిపిస్తుండటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగష్టు 11న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా క్వాలిటీతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా పోస్ట్ పోన్ అయిందట. దీంతో భాగమతి అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే ట్రైలర్ ను రెడీ చేసి పెట్టుకోవడంతో.. దానిని, కొంత మూవీ ఫుటేజ్ ను చూపించి సినిమాను అమ్మేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలో ట్రైలర్ తో పాటు కొంత ఫుటేజ్ ను చూసిన ఒక బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనుష్క భాగమతి హిందీ వెర్షన్ రైట్స్ ను ఏకంగా 12.5 కోట్ల రూపాయలు పెట్టి మరీ కొనేశాడట. దీంతో ఇప్పుడు ఇదంతా అనుష్క ఫేస్ వేల్యూ కారణంగానే జరిగిందని అంటున్నారు. దేవసేనగా బాలీవుడ్ జనాల హృదయాలను కొల్లగొట్టిన అనుష్క.. ఇప్పుడు డైరెక్టర్ అశోక్, యూవీ క్రియేషన్స్ తో సంబంధం లేకుండా సత్తా చాటిందని చెబుతున్నారు. మరోవైపు, తెలుగులో కూడా ఇప్పటికే ఈ సినిమా రూ.40 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ రావడం అనుష్క స్టామినా ఏంటో చాటిచెబుతోంది. మరి ఈ లెక్కన అనుష్క కొంచెం సన్నబడి మూడు నాలుగు భాషల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందేమో.