ఏపీ ఇండ‌స్ట్రీ జీవో ఇప్ప‌టిది కాదు!

Last Updated on by

ఏపీ ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటుపై ఇచ్చిన జీవో ఇప్ప‌టిది కాదా? అది ఎప్పుడో ఇచ్చినా ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేదా? ఇదంతా ప్ర‌భుత్వాల వైఫ‌ల్య‌మేనా? అంటే అవున‌నే స‌మాచారం. వైజాగ్ ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు అన్న‌ది ఇప్ప‌టిది కాదు.. జ‌మానా కాలంలోనే అన్ని జీవోలు రిలీజ‌య్యాయి. కానీ ప్ర‌భుత్వాల్లో చిత్త‌శుద్ధి లేక ప‌ని పూర్త‌వ్వ‌లేదు. పునాది రాళ్లు వేసి ఆ త‌ర్వాత ప‌నులు చేయ‌క గాలికొదిలేశారు. ఫ‌లితంగానే హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి చెందింది. లేదంటే విశాఖ న‌గ‌రంలోనే అస‌లు ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల్సి ఉంద‌ని ప‌లువురు సీనియర్ సినీపెద్ద‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో ఇదే విష‌య‌మై సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ .. ఏపీ ప్ర‌భుత్వంలో చిత్త‌శుద్ధిపైనే అంద‌రికీ సందేహం. ప‌రిశ్ర‌మ అభివృద్ధి చేయ‌డం అన్న‌ది మాట అనేస్తే స‌రిపోదు.. చేత‌ల్లో చూపించాలి అని అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే వైజాగ్‌లో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటు అన్న‌ది ఇప్ప‌టిది కాదు. అప్ప‌ట్లోనే జీవో కూడా ఇచ్చార‌ని మ‌రోమారు గుర్తు చేశారు. అయితే ఎన్నిక‌లు వ‌చ్చేప్పుడు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ కొత్త హ‌డావుడి ఏంటో అర్థం కాదు కానీ, సినీప‌రిశ్ర‌మ‌ను వైజాగ్ లో విస్త‌రిస్తామ‌ని, అలానే కొత్త జీవోలు తెస్తున్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వం హ‌డావుడి చేయ‌డం ప్ర‌ధానంగా టాలీవుడ్ బిగ్‌బిల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఓ ర‌కంగా మెగా ఫ్యామిలీలో ఇప్ప‌టికే వైజాగ్ లో ఇండ‌స్ట్రీ ఏర్పాటు చేయ‌డంపై ఆస‌క్తిగా ఉంద‌న్న చ‌ర్చా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి విశాఖ‌లో స్థిర‌ప‌డేందుకు ఆస‌క్తిగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ ఇండ‌స్ట్రీ ఏర్పాటుకు పెద్ద‌లంతా ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ఛాన్సుందేమో చూడాలి. ఇక‌పోతే ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణానంత‌రం ఇండ‌స్ట్రీకి అస్స‌లు పెద్ద దిక్కు అన్న‌దే లేకుండా పోయింది. ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటార‌ని భావించినా అదేమీ క‌నిపించ‌లేదు. ఇప్పుడు వైజాగ్ ఇండ‌స్ట్రీ ఏర్పాటు అంశంలో కొత్త ఉద్య‌మాన్ని ఎవ‌రు నెత్తికెత్తుకుంటారు? అన్న చ‌ర్చ సినీవ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

User Comments