బ‌న్నికి మ్యాస్ట్రో ఛాన్సిస్తాడా?

Last Updated on by

మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్‌.రెహ‌మాన్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ న‌టించే త‌దుప‌రి చిత్రానికి సంగీతం అందించే అవ‌కాశం ఉంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌.కె.కుమార్ ఇప్ప‌టికే రెహ‌మాన్‌ని సంప్ర‌దించారు. అయితే బ‌న్నికి ఛాన్స్ ఉందా లేదా? అంటే ఇంకా సందేహ‌మే. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌తో రెహ‌మాన్ అనుబంధం అంతంత మాత్ర‌మే. ప‌వ‌ర్‌స్టార్‌ `కొమ‌రం పులి` త‌ర్వాత ఇటువైపు చూడ‌నేలేదు. మొన్న‌నే సైరా – న‌ర‌సింహారెడ్డికి క‌మిటై, త‌ర్వాత క్యాన్సిల్ అని చెప్పాడు. దీంతో అంత పెద్ద ప్రాజెక్టునే కాద‌నుకున్న రెహ‌మాన్ ఎందుక‌నో టాలీవుడ్‌పైనే విముఖ‌త‌గా ఉన్నార‌ని మాట్లాడుకున్నారంతా. మ‌రోవైపు రెహ‌మాన్ త‌మిళం, హిందీ సినిమాల‌కు య‌థేచ్ఛ‌గా ప‌ని చేస్తున్నారు.

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `స‌ర్కార్‌` చిత్రానికి రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో రిలీజ్‌కి రానున్న ఈ సినిమా కోసం లైవ్ పెర్ఫామెన్స్‌ని రెహ‌మాన్ ప్లాన్ చేశారు. ఈ సినిమా రీరికార్డింగ్ కోసం అధునాత‌న‌ సాంకేతిక‌త‌ను స్వ‌ర‌మాంత్రికుడు ఉప‌యోగిస్తున్నార‌ట‌. రెహ‌మాన్ ఆర్ఆర్‌తోనే ఆ సినిమాకి హాలీవుడ్ అప్పీల్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ స్థాయి సంగీత ద‌ర్శ‌కుడు ఓ తెలుగు సినిమాకి ప‌ని చేస్తే అది గౌర‌వంగా భావించాల్సి ఉంటుంది. అయితే ఆ ఫీట్‌ని బ‌న్ని- విక్ర‌మ్‌.కె జోడీ విజ‌య‌వంతంగా సాధ్యం చేసి చూపిస్తారా? అన్న‌ది ఇప్ప‌టికైతే సందేహ‌మే. కాస్త వేచి చూద్దాం.

User Comments