అప్పుడే డ‌బ్బింగ్ స్టార్ట్ చేసిన అర‌వింద స‌మేత‌

Last Updated on by

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. మొన్నైతే షూటింగ్ మొద‌లైంది అప్పుడే డ‌బ్బింగ్ ఏంటి.. అస‌లేంటీ ఈ స్పీడ్ అనుకుంటున్నారా..? మ‌రి అలా ఉందిప్పుడు మాట‌ల మాంత్రికుడి జోరు. ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా ఈ ప‌ని కానిస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఈ మ‌ధ్యే ఎన్టీఆర్ కు కొడుకు పుట్ట‌డంతో షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్. తాజాగా మ‌రో షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. అక్టోబర్ నాటికి.. అందులోనూ ద‌స‌రాకు విడుద‌ల కావాల‌ని ఎన్టీఆర్ అల్టిమేటం జారీ చేయ‌డంతో ఆఘ మేఘాల మీద అర‌వింద స‌మేత‌ను సిద్ధం చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు.

ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే మూడో షెడ్యూల్లో ఎన్టీఆర్ లేడు. ఆయ‌నిప్పుడు వ‌స్తున్నాడు. ఇదే నెల‌లో త‌ర్వాతి షెడ్యూల్ మొద‌లు కానుంది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే అర‌వింద స‌మేత డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. ఓ వైపు షూటింగ్.. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఒకేసారి పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. అలా చేస్తే విడుద‌ల‌కు టెన్ష‌న్ కూడా త‌గ్గుతుంద‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి అజ్ఞాతవాసితో గాడిత‌ప్పిన త్రివిక్ర‌మ్ కెరీర్ కు ఇప్పుడు అర‌వింద స‌మేత కీల‌కంగా మారింది.

User Comments