వెంకీ సేమ్ టు సేమ్… కానీ బాగున్నాడు

రీమేక్ సినిమాలు వెంకటేష్‌కి బాగా అచ్చొచ్చాయి. ఆయ‌న విజ‌యాల్లో ఎక్కువ శాతం అవే. పొరుగు క‌థ‌ల్లో ఎలా న‌టించాలి? ఆ క‌థ‌ల్ని ఎంత వ‌ర‌కు మార్పు చేయాల‌నే విష‌యంలో వెంక‌టేష్‌కి తెలిసిన‌ట్టు మ‌రొక‌రికి తెలియ‌దేమో. ఆయ‌న తాజాగా మ‌రో రీమేక్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో విజ‌యవంత‌మైన `అసుర‌న్‌`ని తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ చేస్తున్నారు. నిన్న రాత్రే నార‌ప్ప లుక్స్‌ని విడుద‌ల చేశారు. అందులో వెంక‌టేష్ చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. అయితే `అసుర‌న్‌` సినిమాలో ధ‌నుష్ ఎలాంటి గెట‌ప్పు వేశాడో, సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగానే వెంక‌టేష్ గెట‌ప్పు క‌నిపిస్తోంది. దీనిపై సోష‌ల్ మీడియాలోనూ చర్చ జ‌రుగుతోంది. గెట‌ప్పు ప‌క్కాగా కాపీ చేశార‌ని, కొత్త ప్ర‌య‌త్నం అంటూ ఏమీ చేయ‌లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ పాత్ర‌, క‌థ రీత్యా అలాంటి గెట‌ప్పే బెట‌రని భావించార‌మే.

కాపీ మాట అటుంచింతే వెంక‌టేష్ ఆ గెట‌ప్పులో క‌నిపిస్తున్న విధానం మాత్రం బాగుంది. చాలామంది ఆ విష‌యాన్నే మెచ్చుకుంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అనంత‌పురం బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ కావ‌డంతో, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడుతున్నారు.