రివ్యూ: అశ్వ‌థ్థామ‌

నటీనటులు : నాగ శౌర్య, మెహ్రిన్ పిర్జా, పోసాని, సత్య , సర్గన్ కౌర్, ప్రిన్స్, జిష్షు సేతు తదితరులు

దర్శకత్వం : రమణ తేజ

నిర్మాత‌లు : ఉషా ములుపూరి

సంగీతం : శ్రీచరణ్ పాకల(సాంగ్స్) జిబ్రాన్(బిజీఎమ్)

సినిమాటోగ్రఫర్ : మనోజ్ రెడ్డి

ఎడిటర్ : గ్యారీ బి హెచ్

విడుదల: 31 జనవరి 2020

ముందుమాట‌
విజ‌యం త‌ప్ప‌నిస‌రి అనిపించినప్పుడు హీరోలు త‌మ సొంత సంస్థ‌ల్నే న‌మ్ముకుంటారు. ఇష్ట‌మైన క‌థ‌ల‌తో, త‌మ ఇష్టాల‌కి త‌గ్గ‌ట్టుగా సినిమా చేస్తుంటారు. అలా చాలామందికి విజ‌యాలే ద‌క్కాయి. `న‌ర్త‌న‌శాల` ప‌రాజ‌యం త‌ర్వాత నాగ‌శౌర్య కూడా సొంత సంస్థ‌లోనే `అశ్వ‌థ్థామ‌` చేశాడు. ఈ క‌థ కూడా నాగ‌శౌర్య సొంతంగా రాసుకున్న‌దే. ఆయ‌న తొలిసారి న‌టించిన థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. మ‌రి ఈ చిత్రం ఆయ‌న్ని మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టించిన‌ట్టేనా? ఇంత‌కీ సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం ప‌దండి…

క‌థ‌
గ‌ణ (నాగ‌శౌర్య‌) అమెరికా నుంచి త‌న చెల్లెలు ప్రియ (స‌ర్గున్ కౌర్‌) నిశ్చితార్థం కోసం వ‌స్తాడు. ఇల్లంతా సంబ‌రాల్లో ఉండ‌గా… ప్రియ మాత్రం ఉరి వేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అది చూసిన గ‌ణ కార‌ణాల్ని తెలుసుకుంటాడు. తాను గ‌ర్భ‌వ‌తిన‌ని, తాను ఎవ్వ‌రి ప్రేమలో లేక‌పోయినా గ‌ర్భం దాల్చాన‌ని ప్రియ చెబుతుంది. ఇలాంటి అనుభ‌వంతోనే మ‌రో అమ్మాయి కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. మ‌రికొంత‌మంది అమ్మాయిల కిడ్నాప్ వెలుగులోకి వ‌స్తుంది. దీనంత‌టి వెన‌క ఏదో జ‌రుగుతోంద‌ని, ఎవరో సూత్ర‌ధారి ఉన్నాడ‌ని గ‌ణ‌కి అర్థ‌మ‌వుతుంది. అది తెలుసుకునే క్ర‌మంలో ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? అస‌లు సూత్ర‌ధారి ఎవ‌రు? ఎందుకు చేస్తున్నాడిలా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
ఈ చిత్ర కథకు తమిళ చిత్రం `కుట్ర‌మ్ 23`తో పోలిక ఉంది. ఆరంభంలో కుటుంబ నేప‌థ్యం చూపించ‌డంతో అస‌లు క‌థ ఆల‌స్యంగా మొద‌ల‌వుతుంది. విరామానికి ముందు మ‌రింత వేగం పుంజుకుంటుంది. అయితే ప్ర‌థమార్థంలో క‌థానాయ‌కుడు ప‌రిశోధ‌న చేసే క్ర‌మం, అంబులెన్స్‌ల‌ని ట్రాక్ చేస్తూ వాటిని ఛేజ్ చేసే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క‌థ‌ని ప‌రుగులు పెట్టిస్తాయి. ద్వితీయార్థం ఆస‌క్తికరంగా మొద‌ల‌వుతుంది. అయితే సైకోగా ప్ర‌తినాయ‌కుడు బ‌య‌టికొచ్చాక అత‌ని వికృత రూపాలు చూశాక క‌థ ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌దు. అప్ప‌టిదాకా థ్రిల్లింగ్‌మూమెంట్స్‌ని పంచిన ఈ సినిమా సైకో చేష్ట‌ల‌తో అస‌హ్యంగా, ఒళ్లు గ‌గుర్పాటుకి గురిచేస్తూ సాగుతుంది. థ్రిల్లింగ్ మరియు క్రైమ్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకి, హింస ఎక్కువైనా భ‌రించేవాళ్ల‌కి ఈ సినిమా న‌చ్చుతుంది. కుటుంబ ప్రేక్ష‌కులు మాత్రం అంత సుల‌భంగా థియేట‌ర్లో కూర్చోలేరు. ఒకొక్క క్లూ ఆధారంగా, క‌థానాయ‌కుడు విల‌న్‌ని చేరుకునే విదానం మెప్పిస్తుంది. ఆద్యంతం థ్రిల్‌ని పంచుతుంది. కానీ ప‌తాక స‌న్నివేశాల‌కి వ‌చ్చేస‌రికిఆ థ్రిల్ మాయ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు మ‌రీ సాదాసీదాగా ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. వంద‌మంది కౌర‌వుల్లోని రాక్ష‌స‌త్వం ఒక‌డిలోనే ఉంటే ఎలా ఉంటుందో, అలాంటి వ్య‌క్తిగా ప్ర‌తినాయ‌కుడిని చూపించారు. అలాంటోడు చావాలంటే, అలాంటోడి డెన్‌లోకి క‌థానాయ‌కుడు వెళ్లాడంటే తిరిగి రావ‌డం ఎంత క‌ష్ట‌మో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ప‌తాక స‌న్నివేశాల్ని స‌గ‌టు తెలుగు సినిమాల్లాగే తీసి అయ్యింద‌నిపించ‌డం అత‌క‌లేదు. ఈ చిత్రంతో నాగ‌శౌర్య మాత్రం యాక్ష‌న్ క‌థానాయ‌కుడిగా అల‌రిస్తాడు.

న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
నాగ శౌర్య చాలా బాగా న‌టించాడు. త‌న ఇమేజ్‌ని మార్చే సినిమా ఇది. కుటుంబ నేప‌థ్యంలోనూ, చెల్లెలితో క‌లిసి చేసిన సెంటిమెంట్ స‌న్నివేశాల్లోనూ మంచి పనితీరుని క‌న‌బ‌రిచాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా చాలా బాగాచేశాడు. మెహ్రీన్ పాత్ర ప‌రిమిత‌మే. హీరోకి ప్రియురాలిగా క‌నిపిస్తుంది. ఆమె తొలి పాట‌లో అందంగా క‌నిపించింది. విలన్ పాత్ర చాలా క్రూరంగా మరియు చెడుగా చూపబడింది. ఆ పాత్ర‌లో జిషుసేన్ గుప్తా చాలా బాగా న‌టించాడు. కామెడీ లేక‌పోవ‌డం, సంగీతం చ‌ప్ప‌గా అనిపించ‌డం ఈ సినిమాకి మైన‌స్‌. ఐరా క్రియేషన్స్ నుండి వ‌చ్చిన ఈ సినిమాలో నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా క‌నిపిస్తాయి. నాగ‌శౌర్య క‌థా ర‌చ‌యిత‌తగా మెప్పిస్తాడు. అయితే ర‌చ‌న స్థాయిలో ద‌ర్శ‌క‌త్వం లేక‌పోవ‌డం సినిమాకి మ‌రో మైన‌స్‌. మొత్తంమీద అశ్వథామా కొన్ని భాగాలుగా మాత్ర‌మే సినిమా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 2.5/5

ఫైన‌ల్‌గా: `అశ్వ‌థ్థామ` అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే మెప్పిస్తాడు