బాల‌య్య‌ను విల‌న్ గా చూపించ‌గ‌ల‌రా..?

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ మారింది. కొన్నేళ్ల కింది వ‌ర‌కు హీరో చ‌చ్చిపోతే చూసేవారు కాదు.. రోగం ఉంటే చూసేవారు కాదు.. హీరో విల‌న్ గా న‌టిస్తే చూసేవారు కాదు.. కానీ ఇప్పుడు అవ‌న్నీ పోయాయి. తెలుగు ఇండ‌స్ట్రీలోనూ కొత్త క‌థ‌లు వ‌స్తున్నాయి. హీరోల్లో కావాల్సినంత మార్పు వ‌చ్చింది. అందుకే హీరోలే విల‌న్లుగా మారిపోతున్నారు కూడా. ఈ మ‌ధ్యే ఎన్టీఆర్ కూడా జై ల‌వ‌కుశ‌లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు. కార్తి, సూర్య‌, విక్ర‌మ్ లాంటి హీరోలు కూడా పూర్తిస్థాయి విల‌న్లుగా మారిపోయారు.

ఇక ఇప్పుడు బాల‌య్య‌కు కూడా ఆ కోరిక క‌లిగింది. త‌న‌కు కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టేసాడు బాల‌కృష్ణ‌. ఈ కోరిక ఇప్పుడు క‌లిగిందో.. లేదంటే మొన్న అబ్బాయి జైల‌వ‌కుశ‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి క‌లిగిందో తెలియ‌దు కానీ త‌న‌కు కూడా విల‌న్ రోల్ చేయాల‌ని ఉంద‌ని నోరు తెరిచి అడిగాడు ఈ హీరో. అన్న‌ట్లు గ‌తంలో సుల్తాన్.. యువ‌ర‌త్న రాణా సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు బాల‌య్య‌. ఇప్పుడు మ‌రోసారి అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ చేయాల‌ని ఉందంటున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు బాల‌య్య‌లోని విల‌నిజాన్ని బ‌య‌టికి తీసే ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..?