బాల‌కృష్ణ‌ ర‌వితేజ‌ ఫైట్ నిజమేనా?

ఓ స్టార్ హీరో వస్తున్నాడని తెలిసిన‌పుడు మ‌రో స్టార్ హీరో కావాల‌ని ఎప్పుడూ పోటీకి రాడు. కానీ ర‌వితేజ‌, బాల‌య్య విష‌యంలో మాత్రం ఇది ప్ర‌తీసారి జ‌రుగుతుంది. అనుకోకుండా జ‌రుగుతుందో లేదంటే నిజంగానే బాల‌య్య‌పై యుద్ధానికి వ‌స్తున్నాడో తెలియ‌దు కానీ ర‌వితేజ ప్ర‌తీసారి బాల‌య్య‌నే టార్గెట్ చేస్తున్నాడు. ఒక్క‌సారి బాల‌కృష్ణ‌.. ర‌వితేజ‌ పేర్లు ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి చ‌ద‌వండి.. ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ వ‌స్తుంది. కొన్నేళ్ల కింద ర‌వితేజ‌ను బాలకృష్ణ మందలించాడ‌ని.. ఓ హీరోయిన్ విష‌యంలో ఈ ఇద్ద‌రూ గొడ‌వ కూడా ప‌డ్డార‌ని.. ఈ వివాదంలో ర‌వితేజ‌కు సీరియ‌స్ వార్నింగ్ లు వెళ్లాయ‌ని అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో వార్త‌లొచ్చాయి. ఆ తర్వాత ఎన్ని జ‌రిగినా కూడా ఈ గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయిందంటారు కొంద‌రు. అందుకే ప్ర‌తీసారి వీరిద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీకి వ‌చ్చిన‌పుడు అదో ర‌క‌మైన తెలియ‌ని వైబ్రేష‌న్స్ వ‌స్తాయి. నిజానికి బాల‌య్య సినిమాల‌పై త‌ను కావాల‌నే యుద్ధానికి దిగుతాడ‌ని ర‌వితేజ‌పై ఓ వార్త కూడా ఉంది. 2008లో బాలయ్య సంక్రాంతికి ఒక్క మగాడు సినిమాతో వస్తే.. రవితేజ కృష్ణగా వచ్చాడు. ఈ రెండింట్లో కృష్ణ హిట్.. ఒక్కమగాడు డిజాస్టర్.

ఆ త‌ర్వాత 2011లో మళ్లీ సంక్రాంతికే బాలయ్య పరమవీరచక్ర.. రవితేజ మిరపకాయ్ సినిమాలతో వచ్చారు. ఈ సారి కూడా సీన్ సేమ్ టూ సేమ్. ర‌వితేజ మిర‌ప‌కాయ్ హిట్.. పరమవీరచక్ర అట్టర్‌ప్లాప్‌. దాంతో సంక్రాంతికి బాల‌య్య‌పై ర‌వితేజ ఇలా ప‌గ తీర్చుకుంటున్నాడంటారనే ప్ర‌చారం కూడా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతుంది. ఏడేళ్ల‌ త‌ర్వాత మ‌ళ్లీ 2018లో వీరిద్దరి సినిమాలు పోటీ ప‌డుతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. బాల‌కృష్ణ జై సింహా జ‌న‌వ‌రి 12న రానుంది. ఇక ఇదే పండ‌క్కి ర‌వితేజ ట‌చ్ చేసి చూడు కూడా విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. విక్ర‌మ్ సిరి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. జ‌న‌వ‌రి 13న ట‌చ్ చేసి చూడు విడుద‌ల కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే పండ‌క్కి ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి సినిమా కూడా విడుద‌ల కానుంది. కానీ అంద‌రి దృష్టి మాత్రం ర‌వితేజ‌, బాల‌య్య‌పైనే ఉంది. ఈ వార్ లో ఎవ‌రు విజ‌యం సాధించ‌బోతున్నారో తెలియాలంటే సంక్రాతి వరకు మనం వేచి చూడాల్సిందే.