బాలయ్య పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంట..!

 

నటసింహం నందమూరి బాలకృష్ణ కొన్నిసార్లు పైకి ఎంత కోపంగా కనిపించినా ఆయన మనస్సు చాలా మంచిదని, చిన్నపిల్లాడి మనస్తత్వం అని అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాలయ్యకు ఎవరైనా ఒక్కసారి నచ్చితే వాళ్ళని వదిలేయరని.. ఎవరి టాలెంట్ అయినా గుర్తిస్తే వాళ్లకు అవకాశం ఇచ్చి కలిసి పని చేసేందుకు వెనుకాడరని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య స్వయంగా దర్శకులకు రికమెండ్ చేస్తూ అవకాశాలు లభించేలా చూస్తుంటారనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే కొంత ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కు బాలయ్య అంటే యెనలేని గౌరవం ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే, ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే, ఈ తరహాలోనే తాజాగా బాలయ్య తన వందో చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్ భట్ కి పిలిచి మరీ తన 102వ సినిమాకి సంగీతం అందించే అవకాశం ఇచ్చారని తెలియడం విశేషం.
ఆ స్టోరీలోకి వెళితే, బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కి చిరంతన్ భట్ తన సంగీతంతో ప్రాణం పోసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు బాలయ్య ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను తన 102వ సినిమా కోసం రికమెండ్ చేశారట. ఈ మేరకు సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తెరకెక్కించనున్న ఈ బాలయ్య 102వ చిత్రానికి చిరంతన్ భట్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే చేసేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని బాలయ్య పిలిచి మరీ ఇవ్వడంతో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కూడా పెద్దగా అభ్యంతరం ఏమీ పెట్టలేదని సమాచారం. ఇదిలా ఉంటే, సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని అంటున్నారు. ఇక బాలయ్య సరసన నయనతారను హీరోయిన్ గా ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా, ఇప్పుడు బాలయ్య – కేఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మాస్ సినిమాకు క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న చిరంతన్ భట్ ఎలాంటి సాంగ్స్ ఇస్తాడో చూడాలి. అలాగే బాలయ్య నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతాడో కూడా చూడాల్సిందే.