ట్రైల‌ర్ టాక్‌: బాల‌య్య ఫ్యాన్స్ కి నిరాశే

BalakrishnaRuler

Last updated on December 9th, 2019 at 11:13 am

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా కే.ఎస్.రవికుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం రూల‌ర్. బాల‌య్య కెరీర్ 105వ చిత్ర‌మిది. ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌రాజ‌యం త‌ర్వాత ఆయ‌న ఎంతో క‌సిగా న‌టిస్తున్న చిత్రం కూడా ఇది. అందుకే అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. అయితే బాల‌య్య‌ను డిజాస్ట‌ర్ల నుంచి బ‌య‌టికి తెచ్చేంత ద‌మ్ము ఈ సినిమాలో ఉందా లేదా? అన్న‌ది తెలియాలంటే ముందు ట్రైల‌ర్ సంగ‌తేమిటో చూడాలి.

రూలర్ ట్రైలర్ ఆద్యంతం బాలయ్య పైనే   ఫోక‌స్ చేసిన ద‌ర్శ‌కుడు రైతు నేప‌థ్యం.. రాజ‌కీయాలు .. అంటూ యాక్ష‌న్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. గ‌త బాల‌య్య సినిమాల్లోనే మాస్ యాక్ష‌న్.. ఎమోషనల్ డ్రామా నే కేఎస్ ఈసారి కూడా న‌మ్ముకున్నార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. బాలయ్య మరోసారి రెచ్చిపోయాడు.. మాస్ పోలీసాఫీసర్‌గా పిచ్చెక్కించాడు. నరుకుడు.. కాల్చుడు.. చంపుడులో ఆయ‌న్ని కొట్టేవాళ్లే లేరు అన్న తీరుగా ఈ ట్రైల‌ర్ ని తీర్చిదిద్దారు. మాస్ ఫ్యామిలీ ఎమోష‌న్ అంటూ ర‌చ్చ ర‌చ్చ చేశార‌నే చెప్పాలి. ముఖ్యంగా బాలయ్యపైనే ట్రైలర్ అంతా కట్ చేసి ఇత‌ర విష‌యాల్ని మ‌రిచారు. కేవ‌లం ట్రైల‌ర్ తో.. అందులో డైలాగుల‌తోనే సినిమా ఏంటో తెలిసిపోయింది. ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చెబుతున్న తీరుకు మాస్ ఫ్యాన్స్ విజిల్స్ వేయ‌డం గ్యారెంటీ. సేమ్ టైమ్ అస‌లు అభిమానులు ఈ చిత్రంలో బాల‌య్య – కేఎస్ బృందం ఏం కొత్త‌గా చూపించ‌బోతున్నారు? అన్న‌ది వాళ్లే చెప్పాలి. ఇక కొన్ని సీన్స్ లో బాల‌య్య ఫంకీ హెయిర్ స్టైల్ కి జ‌నం న‌వ్వుకోవ‌డం ఖాయం. నిర్మాణ విలువ‌లు సోసోగానే ఉండ‌డం విజువ‌ల్ గా క‌నిపిస్తోంది. మరోసారి జై సింహా కాంబినేషన్ రిపీట‌వుతోంది. సినిమా కూడా రొటీన్ క‌థ‌తోనే వ‌స్తోంద‌ని ట్రైల‌ర్ చెబుతోది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ బికినీ అందాలు సినిమాకు బోనస్. పోలీస్ డ్రస్‌తో పాటు మరోవైపు పక్కా సాఫ్ట్ అవతారంలో కూడా రెచ్చిపోయాడు బాలయ్య. ఈ చిత్రం డిసెంబర్ 20న ప‌లు క్రేజీ చిత్రాల‌తో పోటీప‌డుతూ విడుదల‌వుతోంది.