మైండ్ గేమ్ .. యాక్ష‌న్‌తో క‌వ‌చం

యాక్షన్‌ సినిమాలు ప్రేక్ష‌కుల్లోకి బాగా దూసుకెళ‌తాయనేది నా అభిప్రాయం. ప్రేమ‌క‌థ‌ అంటే రెండు, మూడు చేయవచ్చు. పది ప్రేమ‌క‌థ‌ల్లో వరుసగా న‌టించ‌లేం. అదే యాక్షన్ కథలు ఎన్న‌యినా చేయవచ్చు. యాక్షన్ జోన‌ర్‌లో విభిన్న‌మైన కథలున్నాయి. వేరియేషన్‌కు చాలా స్కోప్ ఉంటుంది అని అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ యంగ్ హీరో న‌టించిన తాజా చిత్రం క‌వ‌చం. కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్ నాయ‌కానాయిక‌లుగా వంశధార క్రియేషన్స్ ప‌తాకంపై శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో నవీన్‌ సొంటినేని నిర్మించారు. నేడు సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ…

సినిమాలో నా పాత్ర‌
కవచంలో నేను తొలిసారి పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. ఓ పోలీస్ అధికారిని కావాలనే ఓ కేసులో ట్రాప్‌ చేసి ఇరికిస్తారు. ఆ ట్రాప్‌ నుండి బయటపడి ఆ పోలీస్‌ ఆఫీసర్‌ కేసును ఓ రోజులో ఎలా సాల్వ్‌ చేసుకున్నాడనేదే కథ. ప్రేక్షకుల్లో ఇంటర్వెల్‌ నుండి నెక్స్‌ట్‌ ఏంజరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. సినిమా చాలా రేసీగా ఉంటుంది.
ఇందులో కాజల్‌ అగర్వాల్‌తో రొమాన్స్ ఆక‌ట్టుకుంటుంది. మెహరీన్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మరి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన హీరో ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరికి కవచంగా ఉండి రక్షించాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ద‌ర్శ‌కుడు ప‌నిమంతుడు
దర్శకుడు శ్రీనివాస్‌ దృశ్యం, గోపాలగోపాల వంటి చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. కాబట్టి ఆయన కథ నెరేట్‌ చేసేటప్పుడు చాలా చక్కగా.. అనుభవమున్న డైరెక్టర్‌లా నెరేట్‌ చేశారు. ఈ కథపై మంచి అవగాహన ఉంది. కథలో మంచి ట్విస్టులు, టర్న్స్‌ ఉంటాయి. తొలి పదిహేను నిమిషాలు కథ నార్మల్‌గా ఉంటుంది. తర్వాత నుండి కథలో ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా స్పీడుగా సాగుతుంటుంది. సినిమా చూస్తే.. ఓ కొత్త దర్శకులు చేసినట్లు అనిపించదు. మంచి కమాండింగ్‌తో ఔట్‌ పుట్‌ రాబట్టుకున్నారు. ఆయకేం కావాలనే దానిపై స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు.

బాడీ బిల్డింగ్ అప్ప‌టినుంచి..
జయజానకినాయక, సాక్ష్యం సినిమాల నుండి బాడీ బిల్డప్‌ చేస్తూ వచ్చాను. కాబట్టి ఈ సినిమాకు దాన్నే మెయిన్‌టెయిన్‌ చేస్తూ వచ్చాను. ఇందులో యాక్షన్‌ ఉన్నా థ్రిల్లర్‌ ప్రధానంగా సినిమా సాగుతుంది. ఎక్కడా సినిమా క‌థ‌ దారి త‌ప్ప‌కుండా సాగుతుంది. విమర్శకులకు, ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది.

మంచి రిలీజ్ ముఖ్య ం
పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే రీరికార్డింగ్‌ చక్కగా కుదిరింది. పాటలను కాస్త ముందుగా రిలీజ్‌ చేసుండాల్సిందనిపించింది. డిసెంబర్‌ 2న కూడా సాంగ్‌ రికార్డింగ్‌ చేయలేదు. 3న చేశామంటే ఎంత త్వరగా చేశామో అర్థం చేసుకోవాలి. అందుకు కారణం మంచి రిలీజ్‌ డేట్‌. ఇది మిస్‌ అయితే ఫిబ్రవరి వరకు మంచి డేట్‌ దొరకదు. అనుకున్న తేదీకి విడుదల చేయడానికి చాలా కష్టపడ్డాం.

అమితాబ్‌ సినిమాలు చూశాను
కెరీర్‌ ప్రారంభంలోనే పోలీస్ గా చేశావేంటి? అని చాలా మంది అడిగారు. అయితే ఇది కావాలనుకుని చేసిన పని కాదు. మంచి కథ కుదిరింది కాబట్టే చేశాను. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌ లుక్‌లో చ‌క్క‌ని స్ప ంద‌న వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర‌ పేరు విజయ్‌. పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చేయడానికి ముందు అమితాబ్‌ బచ్చన్‌గారి సినిమాలు చాలానే చూశాను. ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన సినిమాల్లో ఆయన పేరు విజయ్‌. కాబట్టి అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలో నా పాత్ర పేరుని విజయ్‌ అని పెట్టారు.