సాక్ష్యం ట్రైల‌ర్.. ఏదో ఉంది..!

Last Updated on by

సినిమా సినిమాకు త‌న బ‌డ్జెట్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా విజ‌యం అందుకోలేదు కానీ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు మాత్రం సంపాదించుకున్నాడు. ఇప్పుడు కాక‌పోతే రేపు అన్న‌ట్లు ఈ హీరో సినిమాలు భారీగా వ‌స్తున్నాయి. ఇప్పుడు కూడా ఈయ‌న న‌టిస్తోన్న సాక్ష్యం భారీ బ‌డ్జెట్ తో వ‌స్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో పూజాహెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు బెల్లంకొండ‌. శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు బెల్లంకొండ‌. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వ‌చ్చేస్తుంది. విజువ‌ల్ వండ‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు శ్రీ‌వాస్. త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన విల‌న్స్ పై ప‌గ తీర్చుకునే ఓ కుర్రాడి క‌థే ఇది. ఇందులో మీనా హీరో త‌ల్లిగా న‌టిస్తుండ‌టం విశేషం. శ‌రత్ కుమార్, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో ఉన్నారు.

అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. పేరుకు అభిషేక్ క‌నిపిస్తున్నా.. తెర‌వెన‌క మాత్రం బెల్లంకొండ సురేష్ హ‌స్తం ఉంద‌ని తెలుస్తుంది. త‌న‌యున్ని స్టార్ గా నిల‌బెట్ట‌డానికి ప్ర‌తీ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్ తోనే నిర్మిస్తున్నాడు ఈ నిర్మాత‌. ఎలాగైనా త‌న వార‌సున్ని స్టార్ హీరోను చేసి త‌న ఉనికిని చాటుకోవాల‌ని చూస్తున్నాడు బెల్లంకొండ సురేష్. సాక్ష్యం సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ క‌థ‌లో హీరోకు పంచ‌భూతాలే సాక్ష్యంగా నిల‌బ‌డ‌తాయి. అదే ఆయ‌న‌కు బ‌లం కూడా. ట్రైల‌ర్ లోనూ ఇదే హైలైట్ చేసాడు. ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ తొలి విజ‌యం మాత్రం అంద‌లేదు ఈ కుర్ర హీరోకు. జూలై 27న విడుద‌ల కానుంది సాక్ష్యం.

User Comments