ఆ బడా నిర్మాతతో లైట్ బాయ్ కు గొడవేంటి..?

Bellamkonda Suresh lodged complaint Light Boy
టాలీవుడ్ బడా నిర్మాతగా ఇప్పుడిప్పుడే భారీగా పేరు తెచ్చుకుంటున్న బెల్లంకొండ సురేష్ తన కొడుకు బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమాకు అన్నీతానై వెనకుండి చూసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి షూటింగ్ సందర్బంగా ఓ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడని అంటూ బెల్లంకొండ సురేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే, జయ జానకి నాయక సినిమా గత ఏడాది డిసెంబర్ 26 నుంచి జనవరి 2 వరకు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని, అందులో భాగంగా లైట్లు ఏర్పాటు చేసే వ్యక్తికి పని అప్పగించానని, దానికి గాను 2.75 లక్షల రూపాయల బిల్లు చెప్పించానని బెల్లకొండ చెబుతున్నారు.
అంతేకాకుండా ఇప్పుడు ఆ పనితో ఏమాత్రం సంబంధం లేని అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనకు 10.75 లక్షల రూపాయలు చెల్లించమని అదే పనిగా బెదిరిస్తున్నాడని బెల్లకొండ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సదరు వ్యక్తి తరచూ ఫోన్లు చేయడం వల్ల పని డిస్ట్రబ్ అవుతుందని వాపోతున్నారు. ఓవైపు ఇలా ఉంటే, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ రెడ్డి అనే సదరు వ్యక్తి మాత్రం.. తనకు రావాల్సిన డబ్బులు గురించి తాను గతంలోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానని చెబుతుండటం గమనార్హం. అదే విధంగా ఇప్పటికే ఈ విషయంపై తాను మాదాపూర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొనడం విశేషం. అంతేకాకుండా ఇప్పుడు బెల్లకొండ తీరును అశోక్ రెడ్డి తీవ్ర స్థాయిలో తప్పుబడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ ఇద్దరి వాదనలు విన్నాక.. ఎవరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే.. కొంచెం ఆలో, చించాల్సిందే.