చుక్క‌ల్లో `భ‌క్త‌ప్ర‌హ్లాద` బ‌డ్జెట్‌?

Last Updated on by

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఏం చేసినా అది భారీత‌నంతో కూడుకుని ఉంటుంది. ఇంత‌కుముందు అత‌డు తెర‌కెక్కించిన సినిమాల బ‌డ్జెట్లు ఆ మాట చెబుతాయి. రాజీకి రాని మ‌న‌స్త‌త్వంతో అత‌డు ఎంత రిస్క్‌కైనా ఎదురెళ్లి సినిమాలు తెర‌కెక్కిస్తార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఇదివ‌ర‌కూ గుణ తెర‌కెక్కించిన `రుద్ర‌మ‌దేవి` ఎన్నో ఆర్థిక క‌ష్టాల న‌డుమ రిలీజై చ‌క్క‌ని విజ‌యం అందుకుంది. అయితే ఆ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ గుణ‌శేఖ‌ర్ క‌ష్ట‌న‌ష్టాల గురించి రాస్తే గ్రంథ‌మే అవుతుంద‌ని చెప్పుకున్నారు. అదంతా అటుంచితే ఏం జ‌రిగినా .. ఎలాంటి తుఫాన్ అడ్డొచ్చినా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం గుణ‌శేఖ‌రుని స్వ‌భావం అని మ‌రోసారి ప్రూవ్ కాబోతోంది.

చాలాకాలం క్రితం అతడు త‌ల‌పెట్టిన ఓ మ‌హాయ‌జ్ఞాన్ని పూర్తి చేసేందుకు గుణ‌శేఖ‌ర్ రెడీ అవుతున్నారు. అదే భ‌క్త ప్ర‌హ్లాద‌. ఈ సినిమాకి గుణ స్క్రిప్టు రాస్తున్న సంగ‌తి తెలిసిందే. స్క్రిప్టు పూర్త‌వ్వ‌డ‌మే కాదు, ఇప్ప‌టికే సైలెంట్‌గా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టార‌ని అత్యంత స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌క పాత్ర హిర‌ణ్య‌క‌సిపుడిగా రానా న‌టిస్తార‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చార‌మైంది. అయితే అందుకు సంబంధించిన క‌న్ఫ‌ర్మేష‌న్ తెలియాల్సి ఉందింకా. ఇక‌పోతే ఈ చిత్రానికి దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌ని వెచ్చించ‌నున్నార‌న్న లీక్ కూడా అందింది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే టాలీవుడ్‌లో మ‌రో బాహుబ‌లి స్థాయి సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టే. ఆ మేర‌కు విజువ‌ల్ ఫెస్ట్ తెలుగువారికి షురూ అయిన‌ట్టే.

User Comments