రివ్యూ: భీష్మ‌

నటీనటులు: నితిన్, రష్మిక మంద‌న్న‌,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జిషు సేన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు.

ఛాయాగ్ర‌హ‌ణం: సంగీతం: మహతి స్వర సాగర్,

ఛాయాగ్ర‌హ‌ణం: సాయి శ్రీరామ్,

క‌ళ‌: సాహి సురేష్,

కూర్పు: నవీన్ నూలి, సమర్పణ : పి.డి.వి. ప్రసాద్,

నిర్మాత‌: సూర్యదేవర నాగవంశీ,

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల.

ముందుమాట‌:

నితిన్‌కి `అఆ` త‌ర్వాత మ‌రో విజ‌యం లేదు. `లై`, `చ‌ల్ మోహ‌న్ రంగా`, `శ్రీనివాస‌క‌ళ్యాణం`… ఇలా వ‌రుస‌గా మూడు సినిమాలూ ప‌రాజ‌యాలే. ఆయ‌న‌కి అర్జంటుగా ఓ విజ‌యం అవ‌స‌రం ఇప్పుడు. `ఛ‌లో`తో కామెడీపై ప‌ట్టున్న ద‌ర్శ‌కుడ‌నీ, మాస్ అంశాల్నీ స‌మ‌ర్థ‌వంతంగా మేళ‌వించ‌గ‌ల‌డ‌ని నిరూపించుకున్నాడు వెంకీ కుడుముల‌. త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఆయ‌నకి యేడాదిన్న‌ర‌పైగా స‌మ‌యం ఇచ్చి మ‌రీ `భీష్మ‌` క‌థ సిద్ధం చేయించాడు నితిన్‌. ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. నితిన్ – ర‌ష్మిక జోడీ కూడా ప్రేక్షకుల్ని థియేట‌ర్‌వైపు ఆక‌ర్షిస్తోంది. నితిన్ కూడా `దిల్‌`, `సై`లాంటి చిత్రాల‌తో పోలిక పెడుతూ ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాడు. మ‌రి చిత్రం ఎలా ఉంది? నితిన్‌ని మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టిస్తుందా?

క‌థ‌
భీష్మ (నితిన్‌) ఒక ఐఏఎస్‌. అయామ్ సింగిల్ అనే మాట‌ని అలా వాడుతుంటాడన్న‌మాట‌. త‌న జీవితంలోకి ఒక అమ్మాయి వ‌స్తే బాగుంటుంద‌ని ఆశ‌ప‌డుతుంటాడు. ఇంత‌లోనే ఛైత్ర (ర‌ష్మిక‌) వ‌స్తుంది. అమ్మాయి వెన‌కాల ఆడుతూ పాడుతూ తిరిగే ఆ కుర్రాడికీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి సీఈఓ అవుతాడు. ఆ అవ‌కాశం ఎలా వ‌చ్చింది? ఆ కంపెనీకి సీఈవోగా వెళ్లిన భీష్మ‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? త‌నపై ఉన్న బాధ్య‌త‌ల్ని ఎలా చ‌క్క‌బెట్టాడు? భీష్మ అనే పేరున్న ఈ కుర్రాడికీ, అదే పేరుతో ఉన్న ఆ కంపెనీకి సంబంధ‌మేమైనా ఉందా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
ఒక మామూలు క‌థ‌తో కూడా ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లపాటు రంజింప‌జేయ‌డం అంద‌రివ‌ల్లా అయ్యే ప‌ని కాదు. ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక విష‌యంపైన సంపూర్ణ‌మైన ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాల్సిందే. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఫ‌న్ పండించే విష‌యంలో దిట్ట అని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. త‌న బ‌లం అదే అనే సంకేతాల్ని బ‌య‌ట‌పెట్టాడు. ఈ సినిమాలో కూడా కామెడీనే త‌న అస్త్రంగా మార్చుకున్నాడు. క‌థ కంటే కూడా కామెడీకి పెద్ద పీట వేస్తూ సినిమాని తీర్చిదిద్దాడు. క‌థేముందని గుర్తు చేసుకునేలోపే ఏదో ఒక కొత్త పాత్ర‌ని తీసుకొస్తూ ప్రేక్ష‌కుల‌తో న‌వ్వించేశాడు. దాంతో మంచి కాల‌క్షేపం పంచుతూ ఆద్యంతం స‌ర‌దాగా సాగుతుంది చిత్రం. ఈ క‌థ‌, అందులో మ‌లుపులు అన్నీ ఊహించ‌ద‌గిన‌వే. నాట‌కీయంగా వాటి నుంచే హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశాడు. కామెడీనే న‌మ్ముకున్న ద‌ర్శ‌కుడు దానిపైనే దృష్టిపెట్టాడు. కానీ ఎమోష‌న్స్‌ని ట‌చ్ చేయ‌క‌పోవ‌డం మాత్రం ఈ సినిమాకి ప్ర‌ధాన‌మైన మైన‌స్‌గా మారింది. ఇలాంటి క‌థ‌ల‌కి ఎమోష‌న్స్ చాలా అవ‌స‌రం. ఆస్కారమున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు అటువైపే వెళ్ల‌లేదు. నితిన్‌, ర‌ష్మిక‌ల జోడీ కూడా సినిమాకి బ‌లంగా మారింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలే ప్ర‌థ‌మార్థానికి కీల‌కం. ఇక ద్వితీయార్థంలో క‌థ‌లోకి వెళ్లాడు. చిన్న కథే కావ‌డంతో అక్క‌డ కూడా కామెడీనే న‌మ్ముకున్నాడు. దాంతో ఇంట‌ర్వెల్ త‌ర్వాత న‌ల‌భై నిమిషాల‌సేపు నాన్‌స్టాప్‌గా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఇలాంటి క‌థ‌ని నితిన్ న‌మ్మి చేయ‌డం పెద్ద విష‌యం. క‌థ కంటే కూడా వెంకీ కుడుముల టైమింగ్‌ని న‌మ్మే ఈ సినిమా చేసిన‌ట్టున్నాడు. త్రివిక్ర‌మ్ స్కూల్ నుంచి వ‌చ్చిన వెంకీ చాలా సినిమాల్లో త‌న గురువునే గుర్తు చేశాడు. ఒక మామూలు క‌థ‌కి త‌న మార్క్ వినోదాన్ని మేళ‌వించి మురిపించే ప్ర‌య‌త్నం చేశాడు. హీరో విల‌న్ మ‌ధ్య త్రెడ్ కూడా ఏమాత్రం ఆస‌క్తి రేకెత్తించదు. బ‌ల‌మైన విల‌న్ ఉన్న‌ప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. కానీ ఇందులో పాత్ర‌ల్ని కామెడీగా మార్చేశాను కాబ‌ట్టి విల‌నిజం అవ‌స‌రం లేద‌నుకున్నాడేమో. దాంతో చాలా స‌న్నివేశాలు ఫ్లాట్‌గా మారిపోయాయి. ప‌తాక స‌న్నివేశాల్లోనూ చెప్పుకోద‌గ్గ బ‌లం లేదు. సినిమాటిక్‌గా క‌థ‌ని మ‌లిచాడు. న‌వ్విస్తూ హాయిగా రెండున్న‌ర గంట‌లు కాల‌క్షేపాన్నిచ్చే సినిమా ఇది.

న‌టీన‌టులు… సాంకేతిక‌త‌
నితిన్‌, ర‌ష్మిక జోడీ ఆక‌ట్టుకుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. నితిన్ హాస్యం పండించ‌డంలోనూ, మాస్‌గా క‌నిపించ‌డంలోనూ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకి మ‌రో పిల్ల‌ర్‌. ఆయ‌న ప‌రిమళ్‌గా క‌నిపిస్తూ న‌వ్వించాడు. ర‌ఘుబాబు, సంప‌త్‌, న‌రేష్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వెంకీ ర‌చ‌న‌లో దిట్ట అనిపించుకున్నాడు. ఆయ‌న మాట‌లు మెప్పించాయి. క‌థ‌లో కూడా కాస్తంత కొత్త‌ద‌నం ఉండుంటే బాగుండేద‌నిపిస్తుంది.

రేటింగ్: 3/5

 చివ‌రిగా: సింగిల్ భీష్మ ఆద్యంతం న‌వ్విస్తూ ఈజీగా మింగిల్ అయిపోతాడు