ట్రైలర్ టాక్: భీష్మ.. కసితో కనిపించాడు

భీష్మ అనే టైటిల్… సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్‌లైన్ చూశాక ఇదొక పక్కా రొమాంటిక్ సినిమా అని ఫిక్సయిపోతాం. టీజర్ చూశాక కూడా అదే నిజమనిపించింది. ట్రైలర్ దగ్గరికొచ్చేసరికి కలరింగే మారిపోయింది. రొమాంటిక్ టచ్, ఫన్‌తోపాటు… ఇందులో బలమైన ఓ సోషల్ ఎలిమెంట్‌ని స్పృశించిన విషయం బయటపడింది. ఆ ఎలిమెంట్‌లో కూడా కొత్తదనమే కనిపించింది. పంటలపై కెమికల్స్ ప్రభావం, అసహజమైన వంగడాల గురించి ఒక బలమైన విషయాన్ని జోడించినట్టు స్పష్టమవుతోంది. వ్యవసాయం నేపథ్యంలో సినిమాలొచ్చాయి కానీ… ఈ ఎలిమెంట్‌ని మాత్రం స్పృశించలేదు.

మరి ఈ చిత్రంతో ఏం చెప్పారన్నది తెలియాలంటే మాత్రం ఈ నెల 21 వరకు ఆగాల్సిందే. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన `భీష్మ` ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రోజే ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. అందులో సంభాషణలు ఫన్ని పుట్టించడంతోపాటు, హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. బలవంతుడితో గెలవొచ్చు, అదృష్టవంతుడితో గెలవలేవు అంటూ విలన్ హీరోకి వార్నింగ్ ఇస్తాడు. మరి అదృష్టవంతుడితో నితిన్ ఎలా గెలిశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అమ్మాయిల ప్రేమ కోసం కసితో పరితపించే కుర్రాడిగా నితిన్ సందడి చేస్తున్న విషయం ట్రైలర్లో కనిపించింది.