అగ్రనిర్మాత రిలీజ్‌ డైల‌మాతో చేటు

మంచి సినిమా తీయటం ఎంత కష్టమో.. తీసిన మంచి సినిమా రేలీజ్ తేదీ ఫిక్స్ చేయటం కూడా అంతే కష్టం. మంచి రిలీజ్ మంచి స‌క్సెస్ నిస్తుంది! అన్న‌ది ప్రూవైంది. అందుకే ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు అంత‌టి వారే.. రిలీజ్ తేదీ విష‌య‌మై ఏదీ తేల్చుకోలేని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయార‌ట‌. వెంకీ – చైత‌న్య‌ల `వెంకీ మామా` సినిమా రిలీజ్ విష‌య‌మై ఆయ‌న‌లో బోలెడంత డైల‌మా నెల‌కొందట‌. దీంతో నిమిష‌నిమిషం రిలీజ్ తేదీ మారిపోతోంద‌ని చెబుతున్నారు. అయితే నిర్మాత సురేషబాబు ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ డైల‌మాతోనే తేదీ చెప్ప‌కుండా నాన్చేస్తుండ‌డంపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది.

`వెంకీ మామ‌` దసరా కి విడుదల అని తొలుత ప్ర‌క‌టించారు. కానీ `సైరా` లాంటి పాన్ ఇండియా సినిమా ముందు ఎందుకు అని ఆగారు. అప్పటినుండి అనేక డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య జనవరి 14 అని ప్ర‌క‌ట‌న వచ్చింది. దాంతో సంక్రాంతి బ‌రిలో మూడు నాలుగు సినిమాల్ని రిలీజ్ చేస్తున్న మ‌రో అగ్ర నిర్మాత ల‌బోదిబోమ‌న్నార‌ట‌. వెంకీ మామ వ‌స్తే క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తుంద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. త‌న సినిమాల రిలీజ్ తేదీల విష‌యంలో తేడాలొచ్చేస్తాయ‌ని కంగారు ప‌డి డి.సురేష్ బాబుతో మంత‌నాలు సాగించార‌ని ఛాంబ‌ర్ వ‌ర్గాల ద్వారా రివీలైంది.

అయితే  చ‌ర్చ స‌త్ఫ‌లితం ఇవ్వ‌డంతో డిసెంబ‌ర్ 13న వెంకీ మామ రిలీజ‌వుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో ప్ర‌చార‌మైంది. సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకునేందుకు తొలుత స‌రేన‌ని త‌ల ఆడించిన ఆయ‌న‌ రిలీజ్ తేదీని డిసెంబ‌ర్ 13కి ఫిక్స్ చేశార‌ని చెప్పుకున్నారు. అయితే ఇంత‌లోనే మ‌రో ఊహించ‌ని ట్విస్ట్. మళ్ళీ సురేష్ బాబు మనసు మార్చుకుని రిలీజ్ తేదీపై పున‌రాలోచిస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 25 న కానీ.. జనవరి 14 న గాని  రిలీజ్ చేస్తేనే సేఫ్ అవుతామ‌ని ఆయ‌న‌ భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు ఫిల్మ్ నగర్ వ‌ర్గాల్లో నిర్మాత‌ల స‌ర్కిల్స్ లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే డిసెంబ‌ర్ 13 అనుకుని ఇంత‌లోనే మ‌న‌సు మారిపోతే ఎలా? పెద్ద నిర్మాతలకే ఇంత క‌న్ఫ్యూజ‌న్ తో ఉంటే చిన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటూ కాస్త ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీ చూసుకుని ప‌లు చిన్న సినిమాల రిలీజ్ తేదీలు ఫిక్స్ చేయాల్సి ఉంది. అందుకే ఈ ఆందోళ‌న‌.