కుబేరుడు.. గేట్స్​ను​ దాటిన ఆర్నాల్ట్​​

మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. ఒకప్పుడు వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్. కానీ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. తాజాగా మూడో స్థానానికి పడిపోయారు.  రెండో స్థానానికి లగ్జరీ గూడ్స్ మేకర్ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ వచ్చేశారు. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పటికీ… జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు.

బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మంగళవారం విడుదలైంది. జెఫ్ సంపద 8.60 లక్షల కోట్లని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఆర్నాల్ట్ ఆస్తి విలువ 7.43 లక్షల కోట్లు, గేట్స్ ఆస్తి 7.36 లక్షల కోట్లని చెప్పింది. ఆర్నాల్ట్ సంపద ఒక్క ఏడాదిలోనే 2.68 లక్షల కోట్లు పెరిగిందని వివరించింది. ఎల్వీఎంహెచ్ లూయీ వీటన్​,  క్రిస్టియన్ డియోర్, గివెన్చీ లాంటి లగ్జరీ గూడ్స్ కంపెనీలను నడిపిస్తోంది. షాంపేన్ బ్రాండ్ డామ్ పెరిగ్నన్ ఎల్వీఎంహెచ్దే. బ్యూటీ రిటైలర్ సెఫొరా కూడా ఈ సంస్థదే. 70 ఏళ్ల ఆర్నాల్ట్ పారిస్లోని నోటర్​డాం చర్చి రిపేర్ కోసం రూ.1,500 కోట్లు ఇచ్చారు.గేట్స్ తొలి రెండు స్థానాల్లో ఉండకపోవడం బ్లూమ్బర్గ్ ఇండెక్స్ చరిత్రలోనే తొలిసారి. మిలిందా గేట్స్​ ఫౌండేషన్​కు విరాళం ఇవ్వకపోతే ఆయనే టాప్​లో ఉండేవారని బ్లూమ్​బర్గ్​ తెలిపింది.