వాల్మీకిపై రాజ‌కీయ సెగ‌

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా హ‌రిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వాల్మీకి ఈనెల 20న రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో బోయ వాల్మీకిలు పొరాటాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించినా ప‌ట్టించుకోని టీమ్ నేరుగా హైకోర్టు ను ఆశ్ర‌యించింది. కోర్టు నుంచి నోటీసులు వ‌చ్చాయి. తాజాగా ఈసినిమాకు రాజ‌కీయ సెగ త‌గులుతున్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే తెలంగాణ బిజేపీ అద్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో బోయ వ‌ర్గానికి చెందిన నేత‌లు సెన్సార్ బోర్డ్ కు ఫిర్యాదు చేసారు.

టైటిల్ మార్చ‌ని ప‌క్షంలో సినిమా విడుద‌ల కానివ్వం అని హెచ్చ‌రించారు. ఈ వివాదంపై ల‌క్ష్మ‌ణ్ కూడా సీరియ‌స్ గా స్పందించ‌డం విశేషం. గ్యాంగ్ స్ట‌ర్ మూవీకి రామాయ‌ణం రాసిన వాల్మికి పేరు ఎలా పెడ‌తారంటూ కన్నెర్ర‌జేసారు. బోయ కుల‌స్తుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌ని వాటికి చిత్ర బృంందం స‌మాధానం చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేసారు. టైటిల్ మార్చ‌ని ప‌క్షంలో త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌కు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, న‌టులు బాధ్య‌త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు. వాల్మికి యూనిట్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు.