బ్ల‌ఫ్ మాస్ట‌ర్ వేషాలకు ప‌రేషాన్‌

వ‌ర్మ కాంపౌండ్ స్టార్ గా స‌త్య‌దేవ్ సుప‌రిచితం. పూరి తెర‌కెక్కించిన జ్యోతిల‌క్ష్మి చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఈ కుర్రాడిలో గ‌ట్స్ ఉన్నాయంటూ పొగిడేశారంతా. ఆ క్ర‌మంలోనే ఘాజి, అంత‌రిక్షం వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లోనూ న‌టించాడు. అయితే ఇన్నేళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా త‌న స్టామినాకు త‌గ్గ అవ‌కాశాలు రాలేద‌ని ఆవేద‌న చెందేవారి జాబితాలో అత‌డు ఉన్నాడు. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న స‌త్తా చాటుకునే అవ‌కాశం రాలేద‌ని, దానికోస‌మే వేచి చూస్తున్నాన‌ని స‌త్యా అన్నారు.

నేడు బ్ల‌ఫ్ మాష్ట‌ర్ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో స‌త్య న‌ట‌న‌కు క్లాప్స్ ప‌డుతున్నాయిట‌. బ్ల‌ఫ్ మాష్ట‌ర్ గా స‌త్య‌దేవ్ న‌ట‌న ఆక‌ట్టుకుంద‌ని తెలుస్తోంది. ఉత్త‌మ్‌.. ఆకాష్ విహారి.. స్వామీజీ.. ఇలా ర‌క‌ర‌కాల‌ వేషాల‌తో ర‌క్తి క‌ట్టించాడ‌ట‌. స‌త్య‌ డైలాగ్ డెలివ‌రీ, ఎక్స్‌ప్రెష‌న్స్ మెప్పించాయ‌ని పొగిడేస్తున్నారు. ముఖ్యంగా మ‌ల్టీలెవ‌ల్ మార్కెటింగ్ లో మోసగాడిగా, రైస్ పుల్లింగ్ ఎపిసోడ్ లో స‌త్య‌ న‌ట‌న ఆక‌ట్టుకుంద‌ట‌. త‌న పాత్ర‌కు 100శాతం న్యాయం చేశాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. న‌టుడిగా ఇంకా ఇలాంటి మ‌రిన్ని పాత్ర‌లు ప‌డితే కెరీర్ ప‌రుగులు పెడుతుందేమో!