Last Updated on by
కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి అంతే. ఇప్పుడు బోయపాటి శీను సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ముందు నుంచి ఆకాశమంత అంచనాలున్నాయి. దానికితోడు రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్ర బిజినెస్ కు కూడా ఇప్పుడు రెక్కలు వస్తున్నాయి. అసలు ఎవరూ ఊహించని రేట్ కు ఈ సినిమాను అమ్మేస్తున్నారని తెలుస్తుంది. మొన్నటి వరకు రామ్ చరణ్ సినిమా 60 కోట్లు దాటితే వెనక్కి వస్తాయా అనే భయం ఉండేది. కానీ రంగస్థలం ఏకంగా 120 కోట్లకు పైగా షేర్ తీసుకురావడంతో ఆ ధైర్యంతోనే ఇప్పుడు బోయపాటి సినిమాను కూడా హై రేట్లకు అమ్మేస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల వరకు ఈ చిత్రాన్ని 73 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ తో పాటు కర్ణాటక హక్కులు కూడా దిమ్మతిరిగేలా ఉన్నాయి. విదేశాల్లో బోయపాటి సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదు. అయితే రంగస్థలం సృష్టించిన సంచలనాలతో బోయపాటి సినిమాకు కూడా రెక్కలొచ్చేసాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్సే 100 కోట్లు జరుగుతుందని అంచనా. ఇదే నిజమైతే మాత్రం కచ్చితంగా బోయపాటి సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరోసారి ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాయాల్సిందే.. లేదంటే కాన్ఫిడెన్స్.. ఓవర్ కాన్ఫిడెన్స్ కు మధ్య ఊగిపోవాల్సి వస్తుంది.
User Comments