బన్నీ నోట మళ్లీ బాలీవుడ్ మాట

పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగాక హీరోలందరికీ కామన్గా ఎదురవుతున్న ప్రశ్న… హిందీలో సినిమా ఎప్పుడు? అల్లు అర్జున్నైతే ఆ ప్రశ్న చాలా రోజులుగా వెంటాడుతోంది. ఆయన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతూ… ఆన్లైన్లో రికార్డులు కొల్లగొడుతుంటాయి. బన్నీ అంటే బాలీవుడ్ జనాలకి బాగా తెలిసిపోయింది. ఆయన స్టైల్ గురించి అక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటారు. సౌత్లో తమిళంలో తప్ప మిగతా మూడు చోట్లా దుమ్ము దులిపేస్తున్న బన్నీ తదుపరి లక్ష్యం కూడా హిందీనే అట. అందుకోసం ఇప్పుడే అక్కడ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీడియాలో తన గురించి ఎక్కువ ప్రచారం జరిగేలా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

`అల.. వైకుంఠపురములో` సినిమాకి బాలీవుడ్ మీడియా అవసరం అంతగా లేదు. అయినా అక్కడి నుంచి ప్రముఖ మీడియా సంస్థలన్నీ వచ్చి అల్లు అర్జున్ని ఇంటర్వ్యూ చేశాయి. దాంతో ఆ సినిమా గురించీ, అల్లు అర్జున్ మార్కెట్ స్థాయి గురించి బాలీవుడ్ జనాలకి మరింత బాగా తెలిసిపోయింది. ఇక మంచి కథని చూసుకుని అక్కడ రంగంలోకి దిగడం మాత్రమే మిగిలుంది. అదే సంకేతాలే ఇచ్చాడు అల్లు అర్జున్ కూడా. `అల…వైకుంఠపురములో` విడుదలై నెల పైనే అయినా ముంబై నుంచిమీడియా సంస్థలు వస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ని ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నోట హిందీ సినిమా మాట వచ్చింది. అతి త్వరలోనే తన హిందీ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హిందీలోనే సినిమా చేయొచ్చని టాలీవుడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.