ప్చ్‌! టీవీ ఆర్టిస్టుల‌కు వేధింపుల్లేవ‌ట‌!

సినీప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే టీవీ ప‌రిశ్ర‌మ‌లో వేధింపులు త‌క్కువా? అంటే అవున‌నే చెబుతోంది `ర‌థం` హీరోయిన్ చాందిని భ‌గ్వానాని. టీవీ సీరియ‌ళ్లలో న‌టించ‌డం అంటే ఒక‌ ఉద్యోగం లాంటిది. అక్క‌డ మూడు నాలుగు ద‌శ‌ల్లో ఆడిష‌న్స్‌ని ఎదుర్కోవాలి.. కార్పొరెట్ ఉద్యోగంలా ఉంటుంది .. అని చెప్పారు. టీవీ సీరియ‌ళ్లు, టీవీ షోస్‌తో సుదీర్ఘంగా ప‌ని చేశాను. అక్క‌డ‌ కాస్టింగ్ కౌచ్ త‌క్కువేన‌ని, త‌న‌కు అలాంటి అనుభ‌వం ఎదురు కాలేద‌ని తెలిపింది. నేను మామ్‌తో క‌లిసి సెట్స్‌కు వెళ్లేదానిని. అందువ‌ల్ల ఆ ఇబ్బంది త‌లెత్త‌లేద‌ని అంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో చాందిని `ర‌థం`కి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర సంగతుల్ని ముచ్చ‌టించింది.

క‌ల‌ర్స్, జీటీవీ, సోని టీవీ సీరియ‌ళ్లు, రియాలిటీ షోల‌తో ప్ర‌తిభావంతురాలిగా నిరూపించుకుని ప్ర‌స్తుతం పెద్ద తెర క‌ల‌ల్ని నిజం చేసుకుంటున్నాన‌ని చాందిని తెలిపారు. `ర‌థం` చిత్రంలో త‌న పాత్ర గురించి చెబుతూ- ఇదో ప్రేమ‌క‌థా చిత్రం. డ్యాన్స్ అంటే ఇష్ట‌ప‌డే అమ్మాయిగా క‌నిపిస్తాను. తండ్రి ఉండ‌డు. త‌ల్లితోనే క‌లిసి ఉంటుంది. ఆ క్ర‌మంలోనే ఒక అబ్బాయి ప‌రిచ‌యం ..ప్రేమ‌.. ఆ త‌ర్వాత అనూహ్యంగా తండ్రి జీవితంలోకి ప్ర‌వేశించాక ఏమైంది? అన్న‌దే సినిమా అని తెలిపింది. ఆడిష‌న్స్ చేశాక ఈ చిత్రానికి త‌న‌ని ఎంపిక చేసుకున్నార‌ని, ఓ యాడ్ ఏజెన్సీ ద్వారా త‌న‌కు ఈ అవ‌కాశం వ‌చ్చింద‌ని చాందిని తెలిపారు. ఈ శుక్ర‌వారం `ర‌థం` రిలీజ‌వుతోంది. ఈ సినిమా త‌ర్వాత `దిక్సూచి` (దిలీప్ హీరో కం డైరెక్ట‌ర్‌) అనే చిత్రం మ‌రో రెండు నెలల్లో రిలీజ్‌కి రానుంద‌ని తెలిపింది.