కేథ‌రిన్ ఎంత అడిగిందేంటి?

సినిమా ఇండ‌స్ట్రీలో లెక్క‌లే వేరు. మ‌న‌కి అర్జంటుగా ఓ సినిమా కావాలంటే ఒక రేటు, సినిమాకి మ‌నం అవ‌స‌ర‌మ‌య్యాయంటే మ‌రో రేటు. ఈ సూత్రాన్ని క‌థానాయిక‌లైతే మ‌రింత ప‌క్కాగా పాటిస్తుంటారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి కాబ‌ట్టి దాన్ని త‌ప్పు ప‌ట్ట‌డానికేమీ లేదు. యువ హీరోల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంటే హీరోయిన్లు కాస్త రిబేటు ఇస్తుంటారు. వెన‌కా ముందు చూసి పారితోషికం తీసుకుంటారు. అదే సీనియ‌ర్ల ప‌క్క‌న న‌టించాలంటే మాత్రం అడిగినంత ఇవ్వాల్సిందే అని ప‌ట్టుబ‌డుతుంటారు. సీనియ‌ర్ల‌తో నటించ‌డంలో కొంచెం రిస్క్ ఉంటుంద‌నేది వాళ్ల భావ‌న‌. ఆ త‌ర్వాత యంగ్ హీరోల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశాలు వ‌స్తాయో రావో అనే భ‌యం వాళ్ల‌ని వెంటాడుతుంది. అందుకే పారితోషికం కాస్త గ‌ట్టిగానే తీసుకుంటుంటారు.

తాజాగా కేథ‌రిన్ కూడా అదే త‌ర‌హాలో డిమాండ్ చేసింద‌ట‌. ఎంత అడిగిందో తెలియ‌దు కానీ.. మొత్తంగా నిర్మాత‌లు అంత ఇచ్చుకోలేక‌పోవడంతో ఆ డీల్ ఓకే కాలేదు. ఇంత‌కీ ఆ సినిమా ఎవ‌రిదో తెలుసా? బాల‌కృష్ణ‌ది. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో హీరోయిన్ల ఎంపిక కోసం ఎప్ప‌ట్నుంచో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాజాగా కేథ‌రిన్‌ని సంప్ర‌దించార‌ట‌. ఆమెని స‌రైనోడులో యంగ్ ఎమ్మెల్యేగా చూపించి కెరీర్‌కి ఊపు తెప్పించాడు బోయ‌పాటి. ఆ అనుబంధంతో ఆమెని మ‌రోసారి సంప్ర‌దించాడ‌ట‌. కానీ ఆమె పారితోషికం భారీగా డిమాండ్ చేసింద‌ట‌. అంత ఇచ్చుకోలేమ‌ని నిర్మాత చెప్ప‌డంతో ఆమె నో చెప్పేసింద‌ట‌. అదీ అస‌లు సంగ‌తి.