ఛ‌ల్ మోహ‌న్ రంగ రివ్యూ

రివ్యూ: ఛ‌ల్ మోహ‌న్ రంగ
న‌టీన‌టులు: నితిన్, మేఘా ఆకాష్, లిజి, రావు ర‌మేష్, మ‌ధు త‌దిత‌రులు
క‌థ‌: త‌్రివిక్ర‌మ్
క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: కృష్ణ‌చైతన్య‌
నిర్మాత‌లు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్, సుధాక‌ర్ రెడ్డి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌గా మారి చేసిన తొలి సినిమా కావ‌డంతో ఛ‌ల్ మోహ‌న్ రంగ నుంచి తొలి నుంచి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అస‌లు ఈ చిత్రంలో ఏదో ఉంది కాబ‌ట్టే ప‌వ‌న్ నిర్మాత‌గా మారాడు.. పైగా త్రివిక్ర‌మ్ క‌థ ఇచ్చాడు క‌దా అనుకున్నారంతా. మ‌రి ఇప్పుడు సినిమా విడుద‌లైంది. ఆ త్రివిక్ర‌మ్ మార్క్ సినిమాలో క‌నిపించిందా..?

క‌థ‌:
మోహన్ రంగ (నితిన్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అమెరికా వెళ్లాల‌ని చిన్న‌ప్ప‌ట్నుంచీ క‌ల‌లు కంటూనే ఉంటాడు. చివ‌రికి ఎలాగోలా ఓ చిన్న ప‌నితో అమెరికా వీసా సంపాదిస్తాడు. అక్క‌డే ఓ బార్ లో ఫుల్ గా తాగి రోడ్డు మీద ప‌డిన మోహ‌న్ రంగకు మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది. ఆ త‌ర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ ద‌శ‌లో మోహ‌న్ రంగ లైఫ్ కు మేఘా చాలా సాయం చేస్తుంది. దాంతో ఆమెను బాగా అభిమానిస్తాడు మోహ‌న్ రంగ. కానీ అది ప్రేమ అని తెలుసుకునే లోపు మేఘా దూర‌మైపోతుంది. మ‌రి ఈ ఇద్ద‌రు జీవితంలో ఎలా క‌లిసారు..? అస‌లు ఎందుకు విడిపోయారు..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం :
ఛ‌ల్ మోహ‌న్ రంగ.. ఈ టైటిల్ లోనే కావాల్సినంత కామెడీ ఉంటుంది క్లారిటీ ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు. సినిమాలోనూ కొత్త‌గా ఎక్స్ పెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా పాత క‌థ‌తోనే వ‌స్తున్నామ‌ని హింట్ ఇచ్చారు. పైగా త్రివిక్ర‌మ్ కూడా త‌న‌కు తెలిసిన క‌థ‌నే మ‌ళ్లీ ఇచ్చాడు. కాక‌పోతే కాస్త ఎంట‌ర్ టైనింగ్ డోస్ పెంచేసాడు. ప్ర‌తీ సీన్ లోనూ న‌వ్వులు పూయించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్లారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌.. త్రివిక్ర‌మ్. ముఖ్యంగా పంచ్ డైలాగుల విష‌యంలో త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపించింది. ఓ సీన్ లో హీరో తండ్రి నితిన్ తో అంటాడు ఆ కుక్కు పెడిగ్రీ.. నీకు డిగ్రీ ఒకేసారి చేయించ‌లేనురా అని..! ఇంకోచోట వీడు ప‌గ‌లు అలోవేరా.. రాత్రి చెగువేరా అంటాడు.. ఇలాంటి చ‌మ‌క్కులు సినిమాలో చాలానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో త్రివిక్ర‌మ్ రైటింగ్ క‌నిపించింది. కానీ దాని వెన‌క కృష్ణ‌చైత‌న్య కూడా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇద్ద‌రూ క‌లిసే సినిమాను ముందుకు న‌డిపించారు.

ఫ‌స్టాఫ్ అంతా కామెడీతోనే న‌డిచిపోయింది. ముఖ్యంగా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కే చాలా టైమ్ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ప్ర‌తీ సీన్ ను ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. అమెరికా రావ‌డం.. అక్క‌డ హీరోయిన్ తో ప్రేమ‌.. ఆ వెంట‌నే క‌ష్టాలు.. విడిపోవ‌డం.. ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. సెకండాఫ్ లో కూడా క‌థ త‌క్కువ కామెడీ ఎక్కువ‌గా సాగింది. ముఖ్యంగా సీరియ‌స్ సీన్స్ కూడా కామెడీ చేసి పారేసాడు ద‌ర్శ‌కుడు. ఓ వైపు ఎమోష‌న‌ల్ సీన్ ర‌న్ అవుతుంటే.. అండ‌ర్ క‌రెంట్ గా కామెడీ వ‌స్తుంది. కానీ ఎక్క‌డా ఎబ్బెట్టుగా అనిపించ‌దు. అయితే క‌థ అనేది లేక‌పోవ‌డం ఈ చిత్రానికి మైన‌స్. తెలిసిన క‌థ‌నే రెండున్న‌ర గంట‌లు హోల్డ్ చేసాడు. ఇది బి, సి సెంట‌ర్ల వ‌ర‌కు ఎంత వ‌ర‌కు రీచ్ అవుతుంద‌నేది ఛ‌ల్ మోహ‌న్ రంగ విజ‌యాన్ని డిసైడ్ చేయ‌నుంది.

న‌టీన‌టులు:
నితిన్ బాగా చేసాడు. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కు కొట్టిన‌పిండి. పైగా ఇది ఆయ‌న‌కు 25వ సినిమా. త్రివిక్ర‌మ్ ను న‌మ్మి.. కృష్ణ‌చైత‌న్య‌తో క‌లిసి అడుగేసాడు నితిన్. మైల్ స్టోన్ మూవీలో మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు నితిన్. ఇక మేఘా ఆకాష్ న‌టిగా ఇంకా ఎద‌గాలేమో కానీ అందంగా ఉంది. స్క్రీన్ పై మాయ చేసింది. హీరో ఫ్రెండ్ గా మ‌ధు బాగానే న‌వ్వించాడు. ఫ‌స్టాఫ్ లో హీరో ఆఫీస్ మేనేజ‌ర్ గా ప్ర‌భాస్ శీను బాగా చేసాడు. రావు ర‌మేష్ క్యారెక్ట‌ర్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది. ఇది ఓ ర‌కంగా అ..ఆ సినిమాకు కంటిన్యూగా అనిపించింది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. తొలిప్రేమ నుంచి ఈయ‌న‌లో చాలా మార్పు వ‌చ్చింది. ఇప్పుడు కూడా రీ ఫ్రెషింగ్ ఆర్ఆర్ ఇచ్చాడు. అయితే పాట‌ల్లో మాత్రం ఎక్క‌డో విన్న ఫీలింగ్ వ‌స్తుంది. ఎస్ఆర్ శేఖ‌ర్ ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు బోర్ అనిపిస్తాయి. ఇక న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణ్య‌న్ సినిమాటోగ్రాఫీ సూప‌ర్ గా ఉంది. అమెరికా అందాల‌తో పాటు ఊటీ అందాల‌ను కూడా బాగా చూపించాడు. త్రివిక్ర‌మ్ క‌థ పాత‌దే అయినా దాన్ని ఎంట‌ర్ టైనింగ్ గా రాసుకోవ‌డం కృష్ణ‌చైత‌న్య బాగానే స‌క్సెస్ అయ్యాడు. ఈ క‌థ‌ను ఇంత‌కంటే బాగా చెప్ప‌డం కాస్త‌క‌ష్ట‌మే. కానీ ట్రై చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా: కామెడీతో ఛ‌ల్ ఛ‌ల్ మోహ‌న్ రంగ..

రేటింగ్: 3/5

User Comments