ఛ‌లో మూవీ రివ్యూ

Last Updated on by

Last updated on March 8th, 2018 at 12:53 pm

రివ్యూ: ఛ‌లో

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, ర‌ష్మిక మండన్న‌, పోసాని, న‌రేష్, ర‌ఘుబాబు త‌దిత‌రులు

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: వెంకీ కుడుముల‌

చూసి చూడంగానే న‌చ్చేసావే.. ఈ మ‌ధ్య కాలంలో బాగా వినిపించిన పాట ఇది. ఈ ఒక్క పాట‌తో సినిమాలో ఏదో ఉంద‌నే అంచ‌నాలు బాగా పెంచేసింది చ‌లో సినిమా. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. మ‌రి నిజంగానే ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఈ సినిమా నిల‌బెట్టిందా..? ఈ చిత్రానికి ధైర్యంగా ఛ‌లో అంటూ ముంద‌డుగు వేయొచ్చా..?

క‌థ‌:

హ‌రి(నాగ‌శౌర్య‌)కు చిన్న‌ప్ప‌ట్నుంచీ గొడ‌వ‌లంటే ప్రాణం. గొడ‌వ లేక‌పోతే డ‌ల్ అయిపోతుంటాడు. దాంతో హ‌రి చేసే ప‌నుల‌తో అత‌డి తండ్రి(న‌రేష్)కి తిప్ప‌లు త‌ప్ప‌వు. దాంతో గొడ‌వ‌లంటే ఇష్ట‌ప‌డే హ‌రిని తీసుకెళ్లి.. గొడ‌వ‌లు ఎక్కువ‌గా ఉండే తిరుప్పురం అనే ఊళ్లోని కాలేజ్ లో ప‌డేస్తాడు తండ్రి. తెలుగు, త‌మిళ వాళ్ల మ‌ధ్య కంచె వేసుకుని ఉంటారు అక్క‌డ‌. ఇక్క‌డి వాళ్లు అక్క‌డ‌.. అక్క‌డి వాళ్లు ఇక్కడ రాకూడ‌దు అనేది ఆ ఊరి క‌ట్టుబాటు. అలాంటి చోట వేస్తే హ‌రి గొడ‌వ‌ల‌కు దూరం అవుతాడ‌ని భావిస్తాడు అత‌డి తండ్రి. కాలేజ్ లో తొలి చూపులోనే కార్తిక‌(ర‌ష్మిక మండన్న‌)ను ప్రేమిస్తాడు. అప్ప‌ట్నుంచి ఆమె ప్రేమ కోసం క‌ష్ట‌ప‌డ‌తాడు. కానీ ప్రేమ సాధించిన త‌ర్వాత తెలుస్తుంది.. ఆమె త‌మిళ అమ్మాయని. అప్ప‌ట్నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మ‌రి ఆ అమ్మాయిని త‌మిళ వాళ్ల‌ను ఒప్పించి హీరో ఎలా పెళ్లి చేసుకున్నాడు.. ఆ రెండు ఊళ్ల‌ను ఎలా కలిపాడు అనేది క‌థ‌.

క‌థ‌నం:

కొన్ని సినిమాల‌కు క‌థ‌తో అస్స‌లు ప‌నుండ‌దు. ద‌ర్శ‌కుల‌కు క్లారిటీ ఉంటే చాలు. వెంకీ కుడుముల‌కు ఈ విష‌యంలో పిచ్చ క్లారిటీ ఉంది. ఈయ‌న‌కు తెలుసు తాను రాసుకున్న క‌థ చాలా పాత‌ది అని.. రెండు ఊళ్ల‌ను క‌ల‌ప‌డానికి వ‌చ్చే హీరో.. ప‌డ‌ని ఊరు అమ్మాయిని ప్రేమించి వాళ్ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డ‌మే ఛ‌లో లైన్. ఇలాంటి క‌థ‌లు చాలా సినిమాల్లో వ‌చ్చాయి. అందుకే ద‌ర్శ‌కుడు తెలివిగా పూర్తిగా కామెడీపైనే దృష్టి పెట్టాడు. తొలి సీన్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వ‌ర‌కు ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా కామెడీతోనే నెట్టుకొచ్చాడు.

ముఖ్యంగా కాలేజ్ సీన్స్ లో అయితే క‌డుపులు చెక్క‌లు చేసాడు. క్లాస్ రూమ్ లో పోసానితో వ‌చ్చే కామెడీ సీన్స్ అయితే ఫ‌స్టాఫ్ కు హైలైట్. ఇక హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ సీన్స్ కూడా ఫ‌న్నీగానే రాసుకున్నాడు వెంకీ. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు టైమ్ అస్స‌లు తెలియ‌దు. చిన్న ట్విస్ట్ తో ఇంట‌ర్వెల్ కార్డ్ వేసి.. ఆ త‌ర్వ‌త కూడా ఫ‌న్ రైడ్ కొన‌సాగించాడు. అయితే ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డ‌ల్ అవుతుంది. క‌థ‌లోకి కాస్తైనా వెళ్లాలి కాబ‌ట్టి నెమ్మ‌దిస్తుంది. అయితే మ‌రీ బోర్ కొట్టించ‌కుండా వెన్నెల కిషోర్ ను రంగంలోకి దింపాడు. అత‌డు వ‌చ్చిన త‌ర్వాత క‌థ మ‌ళ్లీ న‌వ్వుల బాట ప‌ట్టింది. చివ‌ర్లో రెండు ఊళ్ల మ‌ధ్య ప‌గ ఎందుకో చిన్న పిట్ట‌క‌థ చెప్పి ముగించేసాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు:

నాగ‌శౌర్య బాగా చేసాడు. కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఇంత కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ చేసాడు శౌర్య‌. ద‌ర్శ‌కుడు చెప్పింది ఫాలో అయిపోయాడంతే. ఇక క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక సినిమాకు హైలైట్. త‌న ఎక్స్ ప్రెష‌న్స్ తో సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె మొహంలో అన్ని ఎక్స్ ప్రెష‌న్స్ అద్భుతంగా ప‌లికాయ్. దానికి తోడు సొంత డ‌బ్బింగ్ కావ‌డంతో మ‌రింత ప్ల‌స్ అయింది. ఇక క‌మెడియ‌న్లుగా స‌త్య‌, సుద‌ర్శ‌న్, వైవా హ‌ర్ష కాలేజ్ కామెడీ చాలా బాగా పండించారు. ర‌ఘుబాబు ఓకే. సీనియ‌ర్ న‌రేష్ ఉన్నది కాసేపే అయినా హీరో తండ్రిగా బాగా చేసాడు. వెన్నెల కిషోర్ మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. సెకండాఫ్ ను సింగిల్ హ్యాండ్ తో నిల‌బెట్టాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:

ఛ‌లో తొలి క్రెడిట్ ఇవ్వాల్సింది సినిమాటోగ్రాఫ‌ర్ సాయి శ్రీ‌రామ్ కు. ఈయ‌న ప్ర‌తీ ఫ్రేమ్ ను అందంగా అద్భుతంగా చూపించాడు. సింపుల్ ప్రేమ క‌థ‌ని త‌న కెమెరా మ్యాజిక్ తో మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. ఇక మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు సాగ‌ర్ కూడా త‌న వంతు సాయం చేసాడు. ముఖ్యంగా చూసి చూడంగానే సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మిగిలిన పాట‌లు కూడా ఓకే. ఎడిటింగ్ బాగుంది. స్పీడ్ క‌ట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఇక ద‌ర్శ‌కుడు వెంకీ గురించి చెప్పుకోవాలి. తొలి సినిమానే అయినా కూడా ఎక్క‌డా అలా అనిపించ‌లేదు. తాను రాసుకున్న పాత క‌థ‌నే కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా డైలాగ్స్ ద‌గ్గ‌ర మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. తెలుగు, త‌మిళ వాళ్ల‌పై సెటైర్లు బాగానే రాసుకున్నాడు. బాహుబ‌లి లాంటి సినిమాల‌పై కూడా సెటైర్లు వేసాడు వెంకీ. ఓవ‌రాల్ గా ద‌ర్శ‌కుడిగా వెంకీ తొలి సినిమాతోనే స‌క్సెస్ అయ్యాడు.

చివ‌ర‌గా:
ఛ‌లో.. లే ఛ‌లో.. ఫ‌న్ రైడ్ కు ఛ‌ల్ చ‌ల్ ఛ‌లో.

రేటింగ్: 3/5

User Comments