చాణ‌క్య మూవీ రివ్యూ

Chanakya-Movie-Review
న‌టీన‌టులు:  గోపిచంద్, మెహ్రీన్, సోహైల్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 5 సెప్టెంబ‌ర్ 2019
నిర్మాత‌: అనీల్ సుంక‌ర (ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్)
ద‌ర్శ‌క‌త్వం:  తిరు
ముందు మాట‌:
ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ కథానాయకునిగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `చాణక్య`. అనీల్ సుంక‌ర నిర్మాత‌. సాహ‌సం త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో ఛాలెంజింగ్ స్క్రిప్టును ఎంచుకుని గోపీ చేస్తున్న ఈ యాక్ష‌న్ సినిమాపై టీజ‌ర్.. ట్రైల‌ర్ తో ఆస‌క్తి పెరిగింది. యాక్షన్ మరియు స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ అంచనాల్ని పెంచింది. అయితే వ‌రుస ప‌రాజ‌యాల నుంచి గోపీచంద్ ని ఈ సినిమా బ‌య‌ట‌ప‌డేయ‌నుందా? నేడు థియేట‌ర్ల‌లోకి రిలీజైన‌ ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
క‌థ‌క‌మామీషు:
అర్జున్(గోపిచంద్) ఇండియాకి చెందిన‌ రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ (రా) ఏజెంట్. ఓ మిష‌న్ పై బ్యాంకు ఉద్యోగిగా కొత్త అవ‌తారం ఎత్తుతాడు. ఆ క్ర‌మంలోనే అత‌డి దారికి అడ్డు త‌గిలిన పాకిస్థాన్ కు చెందిన డేంజ‌ర‌స్ తీవ్ర వాది ఖురేషి(సోహైల్) వ‌ల్ల ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడు?  ఈ క‌థ‌లో గోపిచంద్ స్నేహితుల క‌థేమిటి..? స్లీపర్ సెల్స్ ఆప‌రేష‌న్ ఎలా సాగింది?  సోహైల్ తో అర్జున్ పోరాటం ఎలా సాగింది? అన్న‌దే సినిమా. టెర్ర‌ర్ గేమ్ లో రా అధికారి అర్జున్ అలియాస్ గోపిచంద్ చేప‌ట్టిన‌ మిషన్ విజ‌య‌వంత‌మైందా లేదా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.
విశ్లేషణ :
రొటీన్ కి భిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకోవాల‌న్న త‌ప‌న గోపిచంద్ లో తొలి నుంచి ఉంది. త‌న బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టు యాక్ష‌న్ క‌థాంశాల్ని ఎంచుకుంటున్నారు. వాటిలో గొప్ప‌గా న‌టిస్తూ మెప్పిస్తున్నాడు. సాహ‌సం లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో అద్బుత‌మైన థ్రిల్ల‌ర్ లో ఎంత గొప్ప‌గా న‌టించాడు అంతకంటే గొప్ప‌గానే న‌టించాడు ఈ చిత్రంలో.  రా అధికారిగా అత‌డి న‌ట‌న అద్భుతం. సినిమా ఆద్యంతం త‌న భుజ‌స్కంధాల‌పైనే న‌డిపించాడు. మళ్ళీ గోపీచంద్ సినిమాలపై మంచి అభిప్రాయాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు ఏర్పరుచుకున్నారు. కానీ ఎందుక‌నో అత‌డి సినిమాల్లో వీక్ స్క్రీన్ ప్లే కొంత ఇబ్బంది పెడుతోంది. ఆ విష‌యం మ‌రోసారి చాణ‌క్య ప్రూవ్ చేసింది. ఒక అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించిన గోపీచంద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా సినిమాలో కొత్తగా చెప్పుకునేందుకు ఏదీ ఉండ‌దు. ఫ్లాట్ గా సాగే నేరేష‌న్.. సాహ‌సాలు.. ప్రేమ‌క‌థ వ‌గైరా వ‌గైరా వచ్చి వెళుతుంటాయి. తీవ్ర‌వాదం అన్న కాన్సెప్టు ఎంత ఇంట్రెస్టింగ్ అయినా గ‌తంలో చూపించ‌ని విధంగా ఏం చూపించారు? అన్న‌ది చూస్తారు ఆడియెన్. అది కాస్తా మిస్స‌య్యింద‌న్న భావ‌న క‌లుగుతుంది. ఇంటర్వెల్ ముందు అద్భుత‌మైన ట్విస్ట్ ఇచ్చినా… సెకండాఫ్ లో దానిని ప్రొజెక్ట్ చేస్తూ గ్రిప్ పెంచ‌డంలో ఎక్క‌డా స‌ఫ‌లం కాలేదు చాణక్య‌. అద్భుతమైన లొకేష‌న్ల‌లో విజువ‌ల్ రిచ్ ఫీస్ట్ లా అనిపించినా ఇంకేదో మిస్స‌య్యింద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.
ఫస్టాఫ్ మాత్రం గోపీచంద్ సినిమాల నుంచి ఏం కోరుకుంటారో అది లేదు. రొటీన్ కామెడీ, రొటీన్ ల‌వ్ ఏమాత్రం మెప్పించ‌వు. స్పై థ్రిల్లర్ కి కావాల్సిన మ‌సాలా కూడా ఏం క‌నిపించ‌లేదు. రొటీన్ క‌థ‌నం బోరింగ్.  సెకండాఫ్ లో హీరో పాకిస్థాన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కొంత‌ ఆసక్తి పెరుగుతుంది. కానీ క‌థ‌నంలో ట్విస్టులు ఆక‌ట్టుకుంటున్నాయి అన‌గానే మ‌రోసారి నీరుగారే సీన్లు బోర్ కొట్టిస్తాయి. సెకండాఫ్ లో జ‌రీన్ ఖాన్ ఎంట్రీ ఐటెమ్ పాట ఆక‌ట్టుకుంది. ఇక ద‌ర్శ‌కుడిగా తిరు లాంటి ట్యాలెంటెడ్ గ‌య్ మ‌రింత గ్రిప్పింగ్ గా క‌థ‌ను రాసుకుని స్క్రీన్ ప్లే ప‌రంగా జాగ్ర‌త్త తీసుకుని ఉంటే ఇది మ‌రో సాహ‌సం అయ్యి ఉండేది కాద‌ని అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది.
న‌టీన‌టులు:
గోపిచంద్ మ‌రోసారి మాస్ట‌ర్ క్లాస్ పెర్ఫామెన్స్ తో యాక్ష‌న్ హీరోగా రంజింప‌జేసారు. మెహ్రీన్ అంద‌చందాలు .. జ‌రీన్ ఐటెమ్ సంథింగ్ స్పెష‌ల్ అనిపిస్తాయి. ఇత‌ర పాత్ర‌లు ఓకే.
టెక్నీషియ‌న్స్:
వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ విజువ‌ల్ రిచ్ గా అల‌రించింది. అలాగే విశాల్ అందించిన  పాటలు ఓకే. శ్రీచరణ్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ల‌స్ అయ్యింది. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు రీరికార్డింగ్ ప‌నిత‌నం అవ‌స‌రం. అది క‌నిపించింది.
ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్ న‌ట‌న‌.. యాక్ష‌న్
రిచ్ ప్రొడ‌క్ష‌న్ విలువలు
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ అంశాలు సోసో
స్క్రీన్ ప్లే లోపం
ముగింపు
మ‌రోసారి `సాహ‌సం` సీక్వెల్ తీశారనే అనిపించారు
రేటింగ్:
2.5/5