చిరంజీవి.. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..

టాలీవుడ్ లో ఆయ‌న ఓ చ‌రిత్ర‌.. ఓ శ‌కం.. తెలుగు ఇండ‌స్ట్రీ గ‌తిని మార్చేసిన హీరో అత‌డు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాతే పాట‌ల్ని పాట‌ల్లా చూడటం మొద‌లు పెట్టారు ప్రేక్ష‌కులు. డాన్సుల‌కు ఆయ‌న ఆధ్యుడు.. రికార్డుల‌కు ఆయ‌న సినిమాలు కేరాఫ్ అడ్ర‌స్. ఒక్క‌సారి ఆయ‌న ష‌ర్ట్ మ‌డ‌త పెడితే రికార్డులు గ‌ల్లంతైపోయాయి. తెలుగు ఇండ‌స్ట్రీకి తొలి 10 కోట్లు.. 15 కోట్లు.. 20 కోట్లు.. 30 కోట్ల సినిమాల‌ను ప‌రిచ‌యం చేసిన మ‌గ‌ధీరుడు.. ఇవ‌న్నీ సాధించింది ఒకే ఒక్క‌డు.. అత‌డే మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబ‌ర్ 22.. 2017తో ఆయ‌న న‌ట జీవితానికి 39 ఏళ్లు నిండి.. 40వ ఏట అడుగేస్తున్నారు. చిరంజీవి న‌టించిన తొలి సినిమా పునాది రాళ్లు. కానీ విడుద‌లైంది మాత్రం ప్రాణం ఖ‌రీదు. ఈ చిత్రం 1978, సెప్టెంబ‌ర్ 22న విడుద‌లైంది. కే వాసు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించారు.
ప్రాణం ఖ‌రీదు త‌ర్వాత పునాది రాళ్లు విడుద‌లైంది. ఆ త‌ర్వాత ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌, పున్న‌మినాగు లాంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. ఖైదీతో స్టార్ అయిపోయాడు. 80ల్లో విజేత‌, ప‌సివాడి ప్రాణం, య‌ముడికి మొగుడు, అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు లాంటి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో న‌టించి సుప్రీమ్ హీరో అయ్యాడు చిరంజీవి. ఇక 90ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సుప్రీమ్ హీరో కాస్తా మెగాస్టార్ అయ్యాడు. ఊహ‌కు కూడా అంద‌ని రికార్డుల్ని తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేసాడు. మిలీనియం మొద‌ట్లో అన్న‌య్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి.. ఇంద్ర‌తో తొలిసారి 30 కోట్ల సినిమాను తెలుగు ఇండ‌స్ట్రీకి ఇచ్చాడు మెగాస్టార్. 2007 వ‌ర‌కు అంటే దాదాపు పాతికేళ్ల పాటు తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ హీరోగా వెలిగాడు చిరంజీవి.
2008లో రాజ‌కీయాల్లోకి వెళ్లిన చిరంజీవి.. ప‌దేళ్ల త‌ర్వాత ఈ ఏడాది మ‌ళ్లీ ఖైదీ నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్క‌డ కూడా స‌త్తా చూపించి.. ప‌దేళ్ల త‌ర్వాత కూడా తన ప‌వ‌ర్ త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు అన్న‌య్య‌. ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా షేర్ సాధించి.. నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నింటినీ తిర‌గ రాసింది. ఇక ఇప్పుడు 151వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. త‌న పుట్టిన‌రోజు కానుక‌గా 151 మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేయ‌బోతున్నాడు మెగాస్టార్. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. మ‌రి న‌ట‌న‌లో 40 వ‌సంతాలు పూర్తి చేసుకుంటున్న చిరంజీవికి మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుదాం..!