చిరు సినిమా… వినాయ‌క్‌కే అవ‌కాశం

యువ క‌థానాయ‌కుల‌కి త‌గ్గ‌ట్టుగానే అగ్ర హీరో చిరంజీవి కోసం కూడా క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయి. ప‌లువురు యువ ద‌ర్శ‌కులు ఆయ‌న్ని దృష్టిలో ఉంచుకుని క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. మ‌రోపక్క ఆయ‌న్ని రీమేక్ క‌థ‌లు కూడా ఊరిస్తున్నాయి. చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు ముచ్చ‌ట‌ప‌డి మ‌రీ మ‌ల‌యాళ చిత్రం `లూసీఫ‌ర్‌` రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు దాన్ని ఈ యేడాది ప‌ట్టాలెక్కించాల్సిందే అంటున్నారట చిరు. అందుకోసం ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. వి.వి.వినాయక్‌కి ఆ సినిమాని తెర‌కెక్కించే బాధ్య‌త‌ని అప్ప‌జెప్పిన‌ట్టు తెలిసింది. నిజానికి మొద‌ట ఈ సినిమాకోసం సుకుమార్ రంగంలోకి దిగాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ అందులో వాస్త‌వం లేద‌ట‌. సుక్కు ప్ర‌స్తుతం బ‌న్నీ సినిమాతోనే బిజీగా ఉన్నారు.

ఆయ‌న ఆ సినిమా నుంచి బ‌య‌టికొచ్చి, మ‌ళ్లీ ఈ లూసీఫ‌ర్ తెలుగు స్క్రిప్టుని సిద్ధం చేయాలంటే బోలెడంత స‌మ‌యం ప‌డుతుంది. అందుకే ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్న వినాయ‌క్‌కి ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌జెప్పార‌ట చిరు. వినాయ‌క్ రీమేక్ క‌థ‌ల్ని బాగా తెర‌కెక్కిస్తారు. చిరుకే ఠాగూర్‌, ఖైదీ నంబ‌ర్ 150 లాంటి రెండు సూప‌ర్‌హిట్ల‌ని ఇచ్చారు. ఆ రెండూ కూడా రీమేక్ క‌థ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ట్రాక్ రికార్డ్‌ని, త‌న‌తో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునే వినాయ‌కే బెట‌ర్ అనుకున్నార‌ట చిరు. ప్ర‌స్తుతం కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాలో చిరంజీవి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.