సైరా కోసం హాలీవుడ్ ఆర్టిస్టులు..

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. నిజంగానే సైరా న‌ర‌సింహారెడ్డి కోసం హాలీవుడ్ నుంచి ఆర్టిస్టులు దిగుమ‌తి అవుతున్నారు. ఏ విష‌యంలోనూ త‌గ్గ‌కూడ‌ద‌ని ఫిక్సైన త‌ర్వాతే సైరాకు ముహూర్తం పెట్టాడు చిరంజీవి. అందుకే సినిమా ఆల‌స్యం అవుతున్నా ప‌ర్లేదు కానీ ప‌ర్ ఫెక్ష‌న్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టిన‌రోజు కంటే ముందే సైరా కోసం కొబ్బ‌రికాయ్ కొట్టారు. కానీ ఇంకా సెట్స్ పైకి రాలేదు.. దానికి కార‌ణం చిరంజీవి చూపిస్తోన్న జాగ్ర‌త్త‌లే. బాహుబ‌లి 2 సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ పెరిగిన నేప‌థ్యంలో.. త‌మ సినిమా కూడా ఎక్క‌డా దానికి త‌గ్గకుండా ఉండాల‌ని చూసుకుంటున్నాడు చిరు. ఈ చిత్రంలో యుద్ధ స‌న్నివేశాలు చాలానే ఉండబోతున్నాయి. పైగా ఇందులో బ్రిటీష్ వాళ్ల‌ను త‌రిమి కొట్టే వీరుడి పాత్ర చేస్తున్నాడు మెగాస్టార్. ఆ బ్రిటీష్ సైన్యం కోసం ఏకంగా లండ‌న్ నుంచి 200 మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను పిలిపిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

పైగా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి క‌థ కావ‌డంతో త‌న లుక్ విష‌యంలోనూ ఎక్క‌డ లేని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు మెగాస్టార్. మ‌రీ ముఖ్యంగా బ‌రువు కూడా త‌గ్గుతున్నాడు ఈ పాత్ర కోసం. ఇప్ప‌టికే జిమ్ ల‌తో పాటు కేర‌ళ వైద్యం కూడా తీసుకుంటున్నాడు చిరంజీవి. న‌ర‌సింహారెడ్డి పాత్ర కోసం చ‌రిత్ర‌కారుల‌తో కూర్చుని.. ఆ గెట‌ప్ పై సాధ‌న చేస్తున్నాడు. దానికితోడు యుద్ధ విద్య‌లు.. గుర్ర‌పుస్వారిలోనూ శిక్ష‌ణ తీసుకుంటున్నాడు చిరు. అందుకే అనుకున్న దానికంటే ఇంకాస్త‌ ఆల‌స్యంగా సినిమా మొద‌ల‌య్యేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సెట్ల ప‌ని మీదున్నారు చిత్ర‌యూనిట్. ఈ సెట్లు మొత్తం హైద‌రాబాద్ తో పాటు గుజ‌రాజ్ ల‌లో జ‌రుగుతున్నాయి.

డిసెంబ‌ర్ తొలి వారం నుంచి సైరా న‌ర‌సింహారెడ్డి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది. దీనికి మ‌రో కార‌ణం కూడా లేక‌పోలేదు. రంగ‌స్థ‌లం సెట్ లోనే సైరా షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. న‌వంబ‌ర్ చివ‌ర్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. దాంతో అది పూర్తైన త‌ర్వాతే సైరా ప‌ట్టాలెక్క‌నుంది. అదీకాక‌ న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, విజ‌య్ సేతుప‌తి ఇలా స్టార్ క్యాస్ట్ చాలానే ఉన్నారు ఈ చిత్రంలో. అంద‌రి బ‌ల్క్ డేట్స్ ఒకేసారి దొర‌క‌డం అంటే కాస్త క‌ష్ట‌మే. అందుకే డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చాక‌ గానీ షూటింగ్ కు వెళ్ల‌కూడ‌ద‌ని చిరు ఆదేశించాడ‌ని తెలుస్తోంది. 2019 సంక్రాంతి కానుక‌గా సైరా న‌ర‌సింహారెడ్డిని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి చూడాలిక‌.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండ‌బోతుందో..?