చిరు లూసీఫ‌ర్ రీమేక్ లేన‌ట్టే

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసీఫ‌ర్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు కొణిదెల సంస్థ‌ రీమేక్ హ‌క్కులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా రీమేక్ ఇప్ప‌టికి పెండింగులో ప‌డింద‌ని తెలుస్తోంది. సుకుమార్ ఇంత‌వ‌ర‌కూ రీమేక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు. పైగా త‌న‌కు సొంతంగా క‌థ‌లు రాసుకుని వాటిని తీసే అల‌వాటు ఉంది. అందుకే అత‌డు అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేక‌పోవ‌డంతో చిరు ఆ ప్లాన్ ని డ్రాప్ చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే సుకుమార్ ఒక‌వేళ చిరుని డైరెక్ట్ చేయాల్సి వ‌స్తే అత‌డు ఓ స్ట్రెయిట్ క‌థ‌నే మెగా బాస్ కి నేరేట్ చేసే వీలుంటుంద‌ట‌. పైగా సుక్కూ వ‌రుసగా ముగ్గురితో పని చేయాల్సి ఉంది. బ‌న్నితో సినిమా పూర్త‌వ్వ‌గానే ఎన్టీఆర్- ప్ర‌భాస్ లాంటి స్టార్లు అత‌డితో ప‌ని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక చిరు కొర‌టాల స‌హా ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసే ప్ర‌ణాళిక‌లో ఉన్నారు.