చిరు – మ‌హేష్… బంతి రాజ‌మౌళి కోర్టులో!

చిరంజీవి – మ‌హేష్ క‌లిసి న‌టిస్తార‌న్న సంగ‌తి గురించి నిన్న‌టిదాకా వెబ్ వ‌రల్డ్‌, సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మైంది. ఈ రోజు ప్రింట్ మీడియా కూడా ఆ కాంబినేష‌న్ పాట పాడ‌టం మొద‌లుపెట్టింది. అయితే ఈ క‌ల‌యిక‌లో సినిమా తెర‌కెక్కే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ట‌. ఇంకా మ‌హేష్ వ‌ర‌కు ఈ ప్ర‌స్తావనే వెళ్ల‌లేద‌ట‌. చిరంజీవి ఒక‌సారి రాజ‌మౌళితో మాట్లాడాకే మిగ‌తాదేమైనా జ‌ర‌గొచ్చ‌నేది లేటెస్ట్ టాక్‌. అయితే చిరు, ద‌ర్శ‌కుడు కొర‌టాల క‌లిసి మ‌హేష్ గురించి ఆలోచించిన మాట మాత్రం నిజ‌మేన‌ట‌.

త‌మ సినిమాలో న‌టించాల్సిన చ‌ర‌ణ్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు క‌దా, ఆయ‌న తిరిగి ఎప్పుడొస్తాడ‌నే డిస్క‌షన్ జ‌రిగిన‌ప్పుడు ప్ర‌త్యామ్నాయం గురించి ఆలోచ‌న చేశార‌ట చిరు, కొర‌టాల‌. అలా మ‌హేష్ పేరు తెర‌పైకొచ్చింద‌ట‌. కొర‌టాల‌కి కూడా మ‌హేష్ స‌న్నిహితుడు. మీరు ఒప్పుకుంటే నేనొప్పిస్తాన‌ని చిరుతో కొరటాల చెప్పార‌ట‌. అయితే ముందుగా రాజ‌మౌళితో మాట్లాడి, త‌న సినిమా షెడ్యూళ్ల‌లో మార్పుల‌కి ఏమైనా అవ‌కాశం ఉందేమో చూసుకుని ఆ త‌ర్వాతే త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ మొద‌లుపెట్టాల‌నేది చిరు ఆలోచ‌న‌ట‌. ఇప్పుడు బంతి రాజ‌మౌళి కోర్టులో ఉన్న‌ద‌న్న‌మాట‌. ఆయ‌న నిర్ణ‌యం మేర‌కు చిరు – మ‌హేష్ కాంబో ఆధార‌ప‌డి ఉంది. మ‌రి జ‌క్క‌న్న నిర్ణ‌య‌మేమిటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.