ఇంద్ర కుర్రాడు.. హీరో అయ్యాడు..!

 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ మూవీ ‘ఇంద్ర’ లో చిన్నప్పటి చిరుగా నటించిన మాస్టర్ తేజ గుర్తుండే ఉంటాడు. అలాగే చూడాలని ఉంది, యువరాజు లాంటి స్టార్ హీరోలు ఉన్న సినిమాల్లో కూడా బాలనటుడిగా నటించి మెప్పించి పలు అవార్డులు కూడా తేజ అందుకున్నాడు. అటువంటి మాస్టర్ తేజ ఇప్పుడు యంగ్ హీరో అయ్యేలా రంగం సిద్ధం అయింది. ఇంతకుముందే ఈ ఇంద్ర కుర్రాడు హీరో అవుతున్నాడనే టాక్ వచ్చినా.. ఏ ప్రాజెక్టూ ఓకే అవ్వలేదు. కానీ, తాజాగా లక్కీ మీడియా సంస్థ తేజను హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పి ప్రాజెక్టుకు సంబంధించి డీటైల్స్ ను అఫీషియల్ గా ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ (గోపి) మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని, ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించనున్నాడని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ అయిన హరి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సంస్థలో దర్శకత్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు పనిచేశారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా పల్లెటూరి యువత నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథగా ఉంటుందని.. కుటుంబసమేతంగా చూసేలా ఉంటుందని అన్నారు. చివరగా ఈ సినిమాకు ఉయ్యాలా జంపాలా, స్వామి రారా సినిమాలకు సంగీతం అందించిన సన్నీ ఎంఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాణీలిస్తున్నారని తెలియజేశారు. మరి చిన్నప్పుడే చలాకీ కుర్రాడిగా, నేనున్నాన్ నానమ్మ అంటూ పౌరుషం చూపించే కుర్రాడిగా అలరించిన తేజ హీరోగా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.