ఐఫోన్ లో తీసి ఫ్రీగా వేశారు!

మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. ఫ్రీ షోలు అంటూ చాలానే గ‌మ్మ‌త్త‌యిన లాజిక్ ని అప్ల‌య్ చేస్తుంటారు. యువ‌హీరో కం నిర్మాత‌ చేతన్ మద్దినేని నటించిన `బీచ్ రోడ్ చేతన్` నేడు మూడు నాలుగు సినిమాల‌తో పోటీప‌డుతూ రిలీజైంది. ఏపీ తెలంగాణ‌లో ఈ సినిమా రిలీజైన అన్ని థియేట‌ర్లు హౌస్ ఫుల్. ఉచితంగా వ‌స్తే జ‌నం ఊరుకుంటారా?  టిక్కెట్టు దొరక్క‌పోతే థియేట‌ర్ య‌జ‌మాన్యంపైనా తిర‌గ‌బ‌డ్డార‌ట‌. చేతన్ మద్దినేని ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో చేతన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఫాంటసీ క‌థాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ‌క‌థ ఉందిట‌. ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టేమంటే ఈ చిత్రాన్ని కొంత‌భాగం ఐఫోన్ లో తీసార‌ని ఓ వార్త లీకైంది.

ఏదేమైనా .. ప్ర‌యోగాత్మ‌కంగా నేటి ఉద‌యం ఆట‌ను ఉచితంగా ప్ర‌ద‌ర్శించారు. మ్యాట్నీ నుంచి టిక్కెట్లు కొనుక్కోమ‌న్నారు. మ‌రి ఈ ఉచిత ఆఫ‌ర్ ఎంత‌వ‌ర‌కూ ఫ‌లించింది అన్న‌ది నేటి లెక్క‌లు తేలితే కానీ అర్థం కాదు. కొన్ని థియేటర్ల నుంచి వంద‌ల మంది టికెట్స్ దొరక్క నిరాశతో తిరిగి వెళ్లిపోయార‌ట‌. గోదారి జిల్లాల్లో కొన్నిచోట్ల‌.. హైదరాబాద్ లో గోకుల్ – సంధ్య వ‌ద్ద ఇదే సీన్ క‌నిపించింద‌ని చెబుతున్నారు. టెక్నిక్ బాగానే ఉంది కానీ కంటెంట్ ఎలా ఉంది? అన్న‌ది తెలియాలంటే తొలి వీకెండ్ క‌లెక్ష‌న్స్ చూడాలి.