జర్నలిస్టులకు సీఎం జ‌గ‌న్ వరాలు

Last Updated on by

ఏపీ వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్టుల పంట పండ‌నుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కొత్త సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాల‌ని ప్ర‌తిపాదించారు. స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు … కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం అని ప్ర‌క‌టించ‌నున్నారు.

వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాల‌ని కొత్త ప్ర‌తిపాద‌న తేవ‌డం సంచ‌ల‌మైంది. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల పెన్షన్ ఇచ్చేందుకు డిక్లేర్ చేశారు. చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని నిర్ణ‌యించుకున్నారు. జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం అమ‌లు చేయాల‌ని .. 20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ని ప్ర‌తిపాదించారు. అలాగే వెతుకులాట లేకుండా అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాల‌ని జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారు. ఇక సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం క‌ల్పించ‌నున్నారు.

User Comments