గుండు హ‌నుమంత‌రావు తుదిశ్వాస విడిచారు

గుండు హ‌నుమంత‌రావు.. ఈ పేరు విన‌గానే ముందు మ‌న‌కు విచిత్ర‌మైన రూపం క‌ళ్ల‌ముందుకు వ‌స్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేని పేరు ఇది. 90ల్లో త‌న కామెడీతో అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ హాస్య‌న‌టుడు క‌న్నుమూసాడు. కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న గుండు హనుమంతరావు ఫిబ్ర‌వ‌రి 19న ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ స‌భ్యులు హాస్పిట‌ల్ కు త‌ర‌లించినా అప్ప‌టికే ఆయ‌న క‌న్నుమూసిన‌ట్లు వైద్యులు తెలిపారు. గుండు మృతి ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న డ‌యాల‌సిస్ పేషెంట్. నెలకు దాదాపు 2 ల‌క్ష‌లు మందుల‌కే ఖ‌ర్చు అవుతున్న‌ట్లు ఈ మ‌ధ్యే అలీ షోలో చెప్పాడు గుండు హ‌నుమంత‌రావు. అది తెలుసుకుని చిరంజీవి కూడా గుండుకు 2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి 5లక్షలు ఇచ్చింది.

ఆయ‌న ప‌రిస్థితి తెలుసుకుని అలీ కూడా గుండు హనుమంతరావు అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తాన‌ని మాటిచ్చాడు కూడా. దాంతో చాలా సంతోష ప‌డ్డాడు గుండు. కానీ అంత‌లోనే ఆయ‌న త‌నువు చాలించ‌డం శోచ‌నీయం. 1956, అక్టోబర్‌ 10న విజయవాడలో జన్మించాడు గుండు హ‌నుమంత రావు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు మిఠాయి వ్యాపారం చేశారు. అనంతరం సత్యాగ్రహం సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. చాలా త‌క్కువ టైమ్ లోనే 400 లకు పైగా సినిమాల్లో నటించాడు గుండు. టిపిక‌ల్ కామెడీ టైమింగ్ తో అంద‌ర్నీ క‌డుపుబ్బా న‌వ్వించారు. ముఖ్యంగా అహ నా పెళ్లంటలో విన‌బ‌డ‌లా అంటూ గుండు చేసిన కామెడీ ఇప్ప‌టికీ గుర్తే.

ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో చేసిన‌ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు.. ఎస్వీ కృష్ణారెడ్డితో యమలీల, టాప్‌ హీరో, శుభలగ్నం, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాలు.. క్రిమిన‌ల్, కొబ్బిరి బోండాం, బాబాయ్‌ హోటల్ లాంటి ఎన్నో సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు గుండు హ‌నుమంత‌రావు. ఇక చిన్నితెర‌పై కూడా త‌న న‌ట‌న చూపించాడు గుండు. ఈయ‌న న‌టించిన అమృతం సీరియ‌ల్ ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ అద్భుతం. ఇందులో ఆయ‌న చేసిన అంజి పాత్ర గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవంతే. 30 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంటూ.. త‌న కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసిన గుండు హ‌నుమంత‌రావు.. ఇప్పుడు ఇలా వెళ్లిపోయి అంద‌రితోనూ కంట‌ప‌డి పెట్టిస్తున్నారు.