ఏఎన్నార్‌పై విమ‌ర్శ‌లు!

Last Updated on by

ఒకే ఒక్కసారి ఏఎన్నార్ పాత్ర‌లో క‌నిపించాడులే అనుకుంటే, ఇప్పుడు రెండోసారి తాత‌గారి పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌ట అక్కినేని నాగ‌చైత‌న్య‌. తాత‌తో క‌లిసి న‌టించ‌డ‌మే కాదు, ఏకంగా తాత‌గానే న‌టించేస్తున్నాడు! అయితే చైత‌న్య అస‌లు ఏఎన్నార్ పాత్ర‌కు సూట‌య్యాడా? అంటే ప్చ్‌! అని పెద‌వి విరిచేసిన‌వాళ్లున్నారు. `మ‌హాన‌టి` సినిమాలో అన్ని పాత్ర‌ల గురించి జ‌నం ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించుకున్నారు కానీ, అస‌లు నాగ‌చైత‌న్య చేసిన ఆ ఏఎన్నార్ పాత్ర గురించి మాత్రం అస్స‌లు ప్ర‌స్థావించ‌నేలేదు. ఆ సినిమాకి అదొక్క‌టే మైన‌స్ అయ్యింద‌ని విమ‌ర్శించిన‌వాళ్లు ఉన్నారు.

అయితే అందులో చైతూ త‌ప్పేం లేదు. ఆ పాత్ర స్వ‌భావం అలాంటిది. అస‌లు దానికి పెద్దంత‌గా స్కోప్ ఇచ్చే ఆస్కారం కూడా మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌కి క‌నిపించ‌లేద‌నే చెప్పాలి. ఏదో షూటింగులో సోగ్గాడిలా క‌నిపించి హీరోయిన్ల వైపు చూసి చూడ‌న‌ట్టు స్టైల్‌గా చూసి, నాలుగైదు డైలాగులు చెప్పి వెళ్లిపోయే పాత్ర‌. అందువ‌ల్ల‌నే మ‌హాన‌టిలో నాగ‌చైత‌న్య పాత్ర అస్స‌లు ఎలివేట్ కాలేదు. అందుకే ఇప్పుడు మ‌రోసారి అత‌డు ఏఎన్నార్‌గా కనిపిస్తాడు అన‌గానే ఎన్నో సందేహాలు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం మ‌రోసారి చైతూ ఏఎన్నార్ కాబోతున్నాడ‌న్న వార్త టాలీవుడ్‌ని సుడిగాలిలా చుట్టేసింది. దీంతో జ‌నం కంగారు ప‌డాలో, తిక‌మ‌క‌ప‌డాలో తెలీని తేడా స‌న్నివేశంలో ప‌డిపోయారు. ఈసారైనా క్రిష్ త‌న‌కు పూర్తి న్యాయం చేసేలా అదిరిపోయే ట్విస్టులున్న సీన్ల‌లో అయినా చూపిస్తాడేమో చూడాలి.

User Comments