మ‌హాన‌టిలో మాయాబ‌జార్..

సావిత్రి అనేది ఓ పేరు కాదు.. ఓ చ‌రిత్ర‌. ఆమె బ‌యోపిక్ అంటే సావిత్రి ఒక్క‌రితోనే స‌రిపోదు.. ఆమెతో పాటు మ‌రెన్నో జీవితాలు కూడా తెర‌కెక్కించాల్సి వ‌స్తుంది. ఇప్పుడు మ‌హాన‌టి సినిమాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పేరుకు ఇది సావిత్రి జీవిత‌మే అయినా.. సినిమా సాగుతున్న కొద్దీ ఒక్కొక్క‌రు వ‌చ్చి షూటింగ్ లో అడుగు పెడుతున్నారు. ఇప్ప‌టికే ఈ బ‌యోపిక్ లో స‌మంత‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. మోహ‌న్ బాబు ఉన్నారు. స‌మంత జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తుంటే.. ఎస్వీ రంగారావు పాత్ర‌లో మోహ‌న్ బాబు క‌నిపించ‌బోతున్నాడు. సావిత్రి జీవితాన్ని అత్యంత ద‌గ్గ‌ర్నుంచి చూసిన వాళ్ల‌లో ఎస్వీఆర్ కూడా ఒక‌రు. ఇక సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టిస్తుండ‌గా.. మ‌హాన‌టి క‌థ‌ను న‌డిపించే జ‌ర్న‌లిస్ట్ పాత్రలో స‌మంత న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది.

ఇక ఇప్పుడు మ‌హాన‌టిలో మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు వ‌చ్చి చేరిపోయారు. ఈ చిత్రంలో క్రిష్.. త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. సావిత్రి జీవితంలో మాయాబ‌జార్ సినిమా కీల‌కం. సినిమాలో ఈ చిత్రానికి సంబంధించిన స‌న్నివేశాలు.. ఆ టైమ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు చూపించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. మాయాబ‌జార్ సినిమా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి పాత్ర‌లో క్రిష్.. ఆ సినిమాకు అసిస్టెంట్ గా ప‌నిచేసిన సింగీతం శ్రీ‌నివాస రావు పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ సెట్ లో అడుగు పెట్ట‌నున్నారు. సావిత్రి జీవితం ఎక్క‌డ మొద‌లై.. ఎలా ముగిసింది అనే ప్ర‌తీ చిన్న విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నాడు నాగ్ అశ్విన్. మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌ళ‌యాల హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నాడు.

కీర్తిసురేష్, దుల్క‌ర్ పై ప్ర‌స్తుతం కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో.. చీక‌టి కోణాలు కూడా అన్నే ఉన్నాయి. చివ‌రి రోజుల్లో ఆమె తాగుడుకు బానిసై మ‌ర‌ణించింది. వాట‌న్నింటినీ సినిమాలో చూపిస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు.. అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా సావిత్రికి వివాదాలు వ‌చ్చాయి. అయితే సావిత్రి చివ‌రి రోజుల్లో ఎలాంటి క‌ష్టాలు ప‌డ‌లేద‌ని.. ఎంతో హాయిగా ఉంద‌ని.. ఆమె సంపాదించిన దాంతో మ‌రో రెండు త‌రాలు కూర్చుని తినొచ్చు అని ఆమె కూతురు చెబుతుండ‌టం విశేషం. మ‌రి సావిత్రి జీవితాన్ని ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి మ‌హాన‌టి చిత్రం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Follow US