కృష్ణ‌వంశీని ఇక మ‌రిచిపోవాల్సిందేనా..?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ అనే ప‌దం చాలా పెద్ద‌ది. ఇది అంద‌రికీ ఇచ్చేది కాదు.. ఎంతో గొప్ప సినిమాలు చేస్తే కానీ ఈ బిరుదు రాదు. అలాంటి బిరుదును ద‌క్కించుకున్న అరుదైన ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. ఈయ‌న పేరు కంటే ముందు క్రియేటివ్ డైరెక్ట‌ర్ అనే పదం ఉంటుంది. అది ఆయ‌న గొప్ప‌త‌నం. కానీ ఇప్పుడు ఆ పాత కృష్ణ‌వంశీ క‌నిపించ‌ట్లేదు. ఒక‌ప్పుడు ఆయ‌న పేరు చెబితే చ‌రిత్ర సృష్టించిన సినిమాలు గుర్తొచ్చేవి.
ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఓ సింధూరం.. గులాబి.. నిన్నే పెళ్లాడ‌తా.. మురారి.. ఖ‌డ్గం.. చంద‌మామ లాంటి సంచ‌ల‌న సినిమాలు చేసాడు. వీటిలో ఏ ఒక్క సినిమాకు మ‌రో సినిమాతో పోలిక ఉండ‌దు. ఇంత వేరియేష‌న్ ఉన్న సినిమాలు ఒక్క ద‌ర్శ‌కుడి నుంచే వ‌చ్చాయా అంటే ఆశ్చర్య‌పోక త‌ప్ప‌దు. అలాంటి ట్రాక్ రికార్డ్ కృష్ణ‌వంశీ సొంతం.
కెరీర్ మొద‌లుపెట్టిన కొన్నేళ్ల‌లోనే ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసాడు కృష్ణ‌వంశీ. కానీ గ‌త కొన్నేళ్లుగా ఈయ‌న ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. ఇప్పుడు పూర్తిగా ప‌తన‌మ‌య్యే దిశ‌కు వ‌చ్చేసింది. ఈయ‌న చేసిన న‌క్ష‌త్రం డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రంతో కృష్ణ‌వంశీ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడ‌ని అత‌డి అభిమానులు ఆశ‌పడ్డారు. నిజంగానే అనిపించుకున్నాడు.. కానీ కేవీ ఈజ్ బ్యాక్ కాదు.. గో బ్యాక్ అని. అవును..
న‌క్ష‌త్రం సినిమా ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించింది. క‌నీసం ద‌ర్శ‌కుడు సినిమాకు వ‌చ్చిన ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి రావ‌ట్లేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కృష్ణ‌వంశీ నుంచి ఒక‌ప్ప‌ట్లా సినిమా ఆశించ‌డం అత్యాశే. కానీ క్రియేటివ్ డైరెక్ట‌ర్ క‌దా.. ఇప్ప‌టికీ త‌నలో ఆ క‌ళ ఉంద‌ని నిరూపించుకోడానికి త‌ప‌న ప‌డుతూనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే తాను ఫ్లాప్ ఇచ్చిన హీరోనే మ‌ళ్లీ న‌మ్ముకుంటున్నాడు.
గోపీచంద్ తో ఈ ద‌ర్శ‌కుడు ఓ సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. గ‌తంలో ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మొగుడు డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా కానీ కేవీ అంటే గోపీచంద్ కు అదో తెలియ‌ని అభిమానం. అయితే ఇప్పుడు గోపీ కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అభిమానానికి పోయి తాను ఇబ్బందుల్లో ప‌డ‌తాడా.. కృష్ణ‌వంశీకి అవ‌కాశం ఇస్తాడా..? ఏమో ఇండ‌స్ట్రీలో ఏదైనా జ‌ర‌గొచ్చు..!