ఒక్క సినిమా రెమ్యున‌రేష‌న్ 450 కోట్లు..!

Last Updated on by

ఏంటి..? ఒక్క సినిమాకు ఎవ‌రైనా 450 కోట్ల పారితోషికం ఇస్తారా..? అస‌లంత ఇచ్చే నిర్మాత‌లు ఉన్నారా..? ఏం చేస్తే అన్ని వంద‌ల కోట్లు వ‌స్తాయి..? అలాంటిది ఒక్క సినిమాకు 450 కోట్లు ఇస్తారా.. బాబోయ్ ఇక్క‌డ సినిమా అంతా క‌లిపితే కూడా అంతా రావ‌డం లేదు క‌దా అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ ఇప్పుడు ఇంత మొత్తం ఒకే సినిమాకు ఓ స్టార్ హీరో రెమ్యున‌రేష‌న్ గా అందుకోబోతున్నాడు. ప్ర‌పంచంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న న‌టుడు లేడు.. ఆయ‌నే డానియ‌ల్ క్రెగ్. పేరు గుర్తుంది క‌దా.. కేరాఫ్ జేమ్స్ బాండ్. ఇప్ప‌టికే కొన్ని బాండ్ సిరీస్ ల‌లో నటించాడు డానియ‌ల్. వ‌ద్దు వ‌ద్దు అంటూనే లాస్ట్ సిరీస్ కూడా న‌టించాడు. ఇక ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా రాబోతుంది. ఇందులోనూ ఈయ‌నే హీరో. దీనికి ఆస్కార్ విన్న‌ర్ డాని బోయెల్ ద‌ర్శ‌కుడు.

ఈయ‌న‌కు కూడా దాదాపు 70 కోట్ల‌కు పైగా పారితోషికం ఇస్తున్నారు. ఇక డానియ‌ల్ క్రెగ్ మాత్రం ఈ చిత్రం కోసం ఏకంగా 50 మిలియ‌న్ పౌండ్లు అంటే మ‌న క‌రెన్సీలో చూస్తే ఏకంగా 450 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. 2019లో విడుద‌ల కానుంది. అయితే ఇంత మొత్తం ఇవ్వ‌డానికి ఓ కార‌ణం కూడా లేక‌పోలేదు. గ‌త సినిమాలోనే డానియ‌ల్ న‌టించ‌న‌ని చెప్పాడు.. అయితే ఇప్పుడు 25వ భాగం వ‌స్తుంది. ఇప్పుడు ఈయ‌న కానీ త‌ప్పుకుంటే కొత్త హీరోను తీసుకురావాలి.. దానికి అంత క్రేజ్ ఉండ‌దు. అందుకే కాస్త క‌ష్ట‌మైనా.. రెమ్యున‌రేషన్ ఎక్కువైనా ప‌ర్లేదు అని నిర్మాత‌లు అడిగినంతా ఇచ్చి ఈయ‌న్నే ఫిక్స్ చేసుకున్నారు. పైగా ఈ సినిమాకు డానియ‌ల్ స‌హ నిర్మాత కూడా. అంటే లాభాల్లో వాటా కూడా ఉంటుంద‌న్న‌మాట‌. మొత్తానికి ఒకే సినిమాతో ఆస్తులు అన్నీ రాయించుకుంటున్నాడు డానియ‌ల్ క్రెగ్.

User Comments