డిసెంబ‌ర్ లో కుర్రాళ్ల జాత‌ర‌..

సాధార‌ణంగా మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు డిసెంబ‌ర్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అప్పుడు సినిమాలు విడుద‌ల చేస్తే వ‌సూళ్లు స‌రిగ్గా రావ‌ని వాళ్ల న‌మ్మ‌కం. బాలీవుడ్ లో మాత్రం డిసెంబ‌ర్ కు చాలా డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే మ‌న ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు మారుతున్నాయి. డిసెంబ‌ర్ లో ఉన్న లాభాలు తెలుసుకుంటున్నారు. అన్ సీజ‌న్ ను కాస్తా సినిమా సీజ‌న్ గా మార్చేస్తున్నారు. ఒక్క నాగార్జున మాత్ర‌మే డిసెంబ‌ర్లో త‌న సినిమా విడుద‌ల ఉండేలా ప్లాన్ చేసుకునేవాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొడుక్కి అప్లై చేస్తున్నాడు. డిసెంబ‌ర్ 22న విక్ర‌మ్ కే కుమార్- అఖిల్ సినిమా విడుద‌ల కానుంద‌ని చెప్పాడు నిర్మాత నాగార్జున‌. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. ఇందులో అఖిల్ భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది.

ఇక డిసెంబ‌ర్ 15న నాని ఎంసిఏ సినిమా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌ యూనిట్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్. ఇందులో మ‌రోసారి తెలంగాణ అమ్మాయిగానే న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఇక ఇదే నెల‌లో రానున్న మ‌రో సినిమా జవాన్. నాని, అఖిల్ కంటే ముందే మెగా మేన‌ల్లుడు వ‌స్తున్నాడు. అస‌లు డిసెంబ‌ర్ ను మొద‌లుపెట్టేదే సాయిధ‌రంతేజ్. చాలా రోజులుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న జ‌వాన్ డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. బివిఎస్ ర‌వి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా న‌టించింది. మొత్తానికి ఇదే డిసెంబ‌ర్ లో బాలీవుడ్ లో ప‌ద్మావ‌తి.. టైగ‌ర్ జిందా హై లాంటి భారీ సినిమాలున్నాయి. మ‌రి వీటి భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?