సంగీతంలో శ‌క్తి చూపిస్తున్నాడు

తెలుగు ఇండ‌స్ట్రీలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంటే అయితే దేవీ.. లేక‌పోతే థ‌మ‌న్.. మ‌రీ కాక‌పోతే అనూప్.. గ‌త కొన్నేళ్లుగా వీళ్ల పేర్లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మ‌న హీరోల్లోనూ మార్పు వ‌స్తుంది. కొంద‌రు హీరోలు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. కొత్త సంగీతాన్ని కోరుకుంటున్నారు. గ‌తేడాది నుంచి తెలుగులో ఓ కుర్రాడి పేరు బాగా వినిపిస్తుంది. అత‌డే శ‌క్తికాంత్ కార్తిక్. ఫిదా సినిమాతో తెలుగులోకి వ‌చ్చాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. వ‌చ్చిండే అంటూ సంచ‌ల‌నం సృష్టించాడు శ‌క్తి. ఫిదాలో అన్ని పాట‌ల‌కు మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈయ‌న‌. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పిచ్చెక్కించాడు.

ఇదే న‌మ్మ‌కంతో ఇప్పుడు చాలా సినిమాల‌ను తీసుకెళ్లి శ‌క్తి చేతుల్లోనే పెడుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న ర‌వితేజ‌- క‌ళ్యాణ్ కృష్ణ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే స‌గం పూర్త‌యింది. ఇక నిహారిక రెండో సినిమా హ్యాపీ వెడ్డింగ్ కు కూడా శ‌క్తినే సంగీతం అందిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న సాక్ష్యం సినిమాకు కూడా శ‌క్తికాంతే సంగీత ద‌ర్శ‌కుడు. నిజానికి ఈ రెండు సినిమాల‌కు ముందు దేవీ శ్రీ ప్ర‌సాద్ ను తీసుకున్నారు. కానీ ఆయ‌న వ‌దిలేయ‌డంతో అవ‌కాశం శ‌క్తికి వ‌చ్చింది. మొత్తానికి ఈ పాట‌ల‌న్నీ బాగా హిట్టైతే గ‌న‌క తెలుగులో శ‌క్తి సెట్ అయిపోయిన‌ట్లే..!

User Comments